రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా బౌలర్.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే..!

By Srinivas MFirst Published Sep 13, 2022, 3:13 PM IST
Highlights

Ishwar Pandey: భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, పూణే సూపర్ జెయింట్స్ తరఫున పలు  మ్యాచులు ఆడిన ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ ప్రకటించాడు. 

టీమిండియా మాజీ సభ్యుడు ఈశ్వర్ పాండే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 33 ఏండ్ల ఈ మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కూ  వీడ్కోలు  పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు.  భారత జట్టు 2014లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా..  ఆ జట్టులో ఈశ్వర్ పాండే సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్  కింగ్స్ తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫునా ఆడాడు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో ఈశ్వర్ పాండే సభ్యుడు. 

ఈశ్వర్ చంద్ పాండేది మధ్యప్రదేశ్ లోని రెవా జిల్లా. చిన్న పట్టణం నుంచి వచ్చిన ఈశ్వర్.. దేశవాళీ క్రికెట్ లో మెరుగైన ప్రదర్శనలతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే 2014లో భారత జట్టుకు ఎంపికైనా అతడికి ఆడే అవకాశం రాలేదు. దీంతో టీమిండియా తరఫున ఆడాలన్న అతడి కల నిజం కాలేదు. 

తన రిటైర్మెంట్ గురించి ఇన్స్టా వేదికగా పాండే స్పందిస్తూ.. ‘భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇక అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు నేను గుడ్ బై చెబుతున్నా.  2007న ప్రారంభమైన  నా క్రికెట్ జర్నీలో ప్రతీ క్షణాన్ని నేను ఆస్వాదించాను.  చిన్నప్పుడు సైకిల్ మీద 20 కిలోమీటర్లు వెళ్లి ట్రైనింగ్ చేసిన రోజుల నుంచి టీమిండియాకు ఎంపికవడం వరకూ అన్నీ మధుర క్షణాలే.  భారత జట్టులో సభ్యుడిని అయినందుకు గర్వపడుతున్నా. నా  దేశం తరఫున  ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా..  జట్టుకు ఎంపికవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. 

డ్రెస్సింగ్ రూమ్ లో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజాలతో గడపడం నా జీవితంలో మరిచిపోలేనిది. ఐపీఎల్ లో నాకు సపోర్ట్ చేసిన పూణే, చెన్నై ఫ్రాంచైజీలకు నేను ఎంతో కృతజ్ఞుడిని.. ఇన్నాళ్లు  నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, బీసీసీఐకి, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు..’ అని రాసుకొచ్చాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ishwar pandey (@ishwar22)

ఈశ్వర్ పాండే రిటైర్మెంట్ పై  టీమిండియా యువ క్రికెటర్లు వెంకటేశ్ అయ్యర్, అవేశ్ ఖాన్ లు  స్పందించారు.  క్రికెట్ కు గుడ్ బై చెప్పినా  ఈశ్వర్ తన తర్వాత దశలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ చేశారు. 

2014లో సీఎస్కే సభ్యుడిగా ఉన్న ఈశ్వర్ ను ఆ జట్టు రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ లో మొత్తంగా 25 మ్యాచులలో  18వికెట్లు తీశాడు. 2013, 2016 సీజన్లలో పాండే పూణే  తరఫున ఆడాడు. కెరీర్ మొత్తంలో పాండే.. 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 58 లిస్ట్ ఏ మ్యాచ్ లు, 71 టీ20లు ఆడి  394 వికెట్లు సాధించాడు. 

click me!