
సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ ల మధ్య ముగిసిన రెండో టెస్టులో సఫారీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మరోసారి చెలరేగాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టును 53 పరుగులకే కుప్పకూల్చిన కేశవ్.. తాజాగా రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే స్థాయి ప్రదర్శన చేశాడు. ఈసారి బంగ్లాను 80 పరుగులకు ఆలౌట్ చేశాడు. ఈ రెండు సందర్భాలలో కేశవ్.. ఏడు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రెండు ఇన్నింగ్స్ లలోనూ కేశవ్ తో పాటు మరో బౌలర్ సిమోన్ హర్మర్ కు మూడు వికెట్లు దక్కడం విశేషం. పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్ పై 332 పరగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కాస్త ప్రతిఘటించిన బంగ్లాదేశ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేసింది.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 412 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 80 పరుగులకే చేతులెత్తేసింది. కేశవ్ మహారాజ్ మరోసారి ఏడు వికెట్లతో చెలరేగగా... హర్మర్ కు 3 వికెట్లు దక్కాయి. వీళ్లిద్దరి ధాటికి బంగ్లాదేశ్ లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. వికెట్ కీపర్ లిటన్ దాస్ (27) హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు.
అంతకుముందు ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా... 136 ఓవర్లలో 453 పరగులకు ఆలౌట్ అయింది. కేశవ్ మహారాజ్ (84), ఎల్గర్ (70), కీగన్ పీటర్సన్ (64), బవుమా (67) లు రాణించారు. బదులుగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే ఆలౌటైంది. ముష్ఫీకర్ రహీమ్ (51) టాప్ స్కోరర్. తమీమ్ ఇక్బాల్ (47), యాసిర్ అలి (46) రాణించారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. కాగా 412 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్.. 80 పరుగులకే చాప చుట్టేసింది.
రెండు టెస్టులలో కలిపి 16 వికెట్లు తీసిన కేశవ్ మహారాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. డర్బన్ లో జరిగిన తొలి టెస్టులో కూడా సౌతాఫ్రికా 220 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ టెస్టు సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0 తో గెలుచుకుంది.