
స్వదేశంలో వరుసగా మూడు టీ20 సిరీస్ లను గెలుచుకుని జైత్రయాత్ర కొనసాగిస్తున్న టీమిండియా.. అంతర్జాతీయ ర్యాంకింగ్స్ లో కూడా జోరు కొనసాగిస్తున్నది. ఈ ఏడాదికి (2021-22) చివరిసారిగా ప్రకటించే అంతర్జాతీయ ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్ లో.. టీ20లలో భారత జట్టు నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. గతేడాది దుబాయ్ లో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో దారుణమైన వైఫల్యాలతో గ్రూప్ స్టేజ్ లోనే ఇంటి బాట పట్టిన టీమిండియా.. ఆ తర్వాత ఆడిన ఏ ఒక్క టీ20 మ్యాచ్ లో కూడా ఓడలేదు. వరుసగా 12 మ్యాచులు గెలిచిన రోహిత్ సేన.. ఐసీసీ టీ20 పురుషుల ర్యాకింగ్ లో అగ్రస్థానంలో నిలిచింది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో.. భారత జట్టు 270 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ 265 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 261 పాయింట్లతో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు తొలుత వరల్డ్ కప్ రన్నరప్ న్యూజిలాండ్ ను 3 మ్యాచుల టీ20 సిరీస్ లో మట్టికరిపించింది. ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక సిరీస్ లలో కూడా అవే ఫలితాలు రిపీట్ చేసింది. రోహిత్ భారత సారథి అయ్యాక అతడు ఆడిన ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడిపోలేదు. దీంతో భారత జట్టు టీ20లలో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకుంది. ప్రపంచ ఛాంపియన్లు (2021) ఆస్ట్రేలియా ఐదో స్థానంలో ఉండటం గమనార్హం.
టీ20లలో నెంబర్ వన్ పొజిషిన్లో ఉన్న రోహిత్ సేన.. టెస్టులలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 128 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలవగా.. 119 పాయింట్లతో ఇండియా రెండో స్థానానికి పరిమితమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్లు న్యూజిలాండ్ మూడో స్థానంలో నిలిచారు. యాషెస్ ను 4-0తో దక్కించుకున్న ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పాక్ తో ఆడిన మూడు టెస్టుల సిరీస్ లో 1-0 తో విజేతగా నిలవడంతో ఆ జట్టు అగ్రస్థానానికి చేరింది.
ఇక వన్డేలలో న్యూజిలాండ్ (125 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు (105 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.