అహ్మదాబాద్‌లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్లిన రోహిత్ శర్మ... ఇంటి నుంచి పూణేలో తన కారులో ప్రయాణం!
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత 5 రోజుల బ్రేక్ రావడంతో కొందరు ముంబై ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ముంబైలో ఉండే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ కో... ఇళ్లకు వెళ్లారు.
అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ ముగించుకున్న రోహిత్ శర్మ, కుటుంబంతో కలిసి పవన్ హన్స్ హెలికాఫ్టర్‌లో ముంబైకి వచ్చాడు. రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్ శర్మ, పూణేలో ఉన్న టీమిండియాని కలిసేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు..
ముంబై నుంచి తన బ్లూ కలర్ లంబోర్ఘిని కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పూణే వచ్చాడు రోహిత్ శర్మ. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్ వేలో రోహిత్ శర్మ ఏకంగా గంటకు 200 కి.మీ.ల వేగంతో కారుని నడిపినట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఒకానొక దశలో రోహిత్ కారు స్పీడ్ 215 కి.మీ.లకు చేరింది..
దీంతో రోహిత్ శర్మకు మూడు చలాన్లు వేసింది ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్. గత ఏడాది డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ హైవేలో ఇదే విధంగా బుల్లెట్ వేగంతో కారు నడిపిన టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే..
రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడం వల్లే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది భారత జట్టు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ రిషబ్ పంత్ లేని లోటు క్లియర్‌గా తెలుస్తోంది.
ఈ విషయం తెలిసి కూడా రోహిత్ శర్మ ఇంత స్పీడ్‌గా కారు డ్రైవింగ్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే రోహిత్ శర్మ శరీరం చాలా సున్నితమైనది. గట్టిగా ఓ సిరీస్ ఆడితే, తర్వాతి సిరీస్ నుంచి రెస్ట్ తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి, ఇలాంటి రాష్ డ్రైవింగ్ చేయడం అతనికి, టీమ్‌కి ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..