New Zealand vs Afghanistan: ఒకే పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్... హాఫ్ సెంచరీలతో ఆదుకున్న కెప్టెన్ టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ ...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా నేడు చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 288 పరుగుల భారీ స్కోరు చేసింది.. ఒకే పరుగు తేడాతో 3 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ని కెప్టెన్ టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఆదుకున్నారు..
18 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన డివాన్ కాన్వేని ముజీబ్ వుర్ రహీమ్ అవుట్ చేశాడు. 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. రచిన్ రవీంద్ర- విల్ యంగ్ కలిసి రెండో వికెట్‌కి 79 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
అయితే 109/1 స్కోరుతో ఉన్న న్యూజిలాండ్, వరుసగా 3 వికెట్లు కోల్పోయి 110/4 స్థితికి చేరుకుంది. కేన్ విలియంసన్ ప్లేస్‌లో వచ్చిన విల్ యంగ్, 64 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. రచిన్ రవీంద్రని అవుట్ చేసిన అజ్మతుల్లా, అదే ఓవర్‌లో విల్ యంగ్‌ని కూడా పెవిలియన్ చేర్చాడు.
41 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర, అజ్మతుల్లా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 7 బంతులాడి 1 పరుగు చేసిన డార్ల్ మిచెల్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ దశలో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఐదో వికెట్‌కి 144 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు..
80 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 71 పరుగులు చేసిన గ్లెన్ ఫిలిప్స్, నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో టామ్ లాథమ్ కూడా బౌల్డ్ అయ్యాడు. 74 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు టామ్ లాథమ్..
254 పరుగుల వద్ద మళ్లీ 1 పరుగు తేడాలో 2 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.. మార్క్ ఛాప్‌మన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా మిచెల్ సాంట్నర్ ఓ ఫోర్ బాది 7 పరుగులు చేశాడు.