
పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ షాహీన్ షా అఫ్రిది తన సహచర ఆటగాడు, పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ పై సెటైర్లు వేశాడు. రిజ్వాన్ చేసిన పని వల్ల తాము రిటైర్మెంట్ ప్రకటించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కౌంటీ క్రికెట్ లో భాగంగా ప్రస్తుతం సస్సెక్స్ తరఫున ఆడుతున్న మహ్మద్ రిజ్వాన్ బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. వికెట్ కీపర్ అయి ఉండి బౌలింగ్ చేయడమేంటని అఫ్రిది ప్రశ్నించాడు. సస్సెక్స్ తరఫున ఆడుతున్న రిజ్వాన్.. ఆదివారం తనలోని బౌలింగ్ ప్రతిభను కూడా బయటకు తీశాడు. డర్హమ్ తో మ్యాచ్ సందర్బంగా రిజ్వాన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వికెట్లేమీ తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సస్సెక్స్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేశాడు. మహ్మద్ రిజ్వాన్ కౌంటీలలో తన తొలి ఓవర్ వేశాడు..’ అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ కు అఫ్రిది స్పందించాడు. షాహీన్ స్పందిస్తూ.. ‘రిజ్జీ (రిజ్వాన్) భాయ్.. ఏంటి మేమిప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలా ఏంటి..? నువ్వు అక్కడ ఏం చేయడానికి వెళ్లావ్..? ఏం చేస్తున్నావ్..? కొంచెం మా గురించి కూడా ఆలోచించు..’ అని ఫన్నీ గా రాసుకొచ్చాడు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
పాకిస్తాన్ జాతీయ జట్టుకు వికెట్ కీపర్ గా ఉన్న రిజ్వాన్.. కీపింగ్ తో పాటు టీ20లలో ఓపెనర్ గా అదరగొడుతున్నాడు. బాబర్ ఆజమ్ తో కలిసి టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నాడు. రిజ్వాన్ బౌలింగ్ వేయడం చాలా అరుదు. ఇందుకే అఫ్రిది కూడా ఇలా స్పందించాడు. ప్రస్తుతమున్న పాక్ జట్టులో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ తో పాటు షాహీన్ షా అఫ్రిది కూడా కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక షాహీన్.. త్వరలోనే పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కూతురును పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా సస్సెక్స్ జట్టులో రిజ్వాన్ తో పాటు టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా కూడా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో పుజారా.. డబుల్ సెంచరీ (203) సాధించగా రిజ్వాన్ 79 పరుగులు చేశాడు. వీళ్లిద్దరితో పాటు మిగతా బ్యాటర్లు కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో సస్సెక్స్.. 538 పరుగుల భారీ స్కోరు చేసింది. డర్హమ్ తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు 3 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ పేలవమైన డ్రాగా ముగిసింది.