
దేశవాళీ క్రికెట్ లో ప్రతిష్టాత్మక ఇరానీ కప్ - 2022-23 ను రెస్టాఫ్ ఇండియా జట్టు దక్కించుకుంది. గ్వాలియర్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో మాజీ రంజీ ఛాంపియన్ మధ్యప్రదేశ్ పై రెస్టాఫ్ ఇండియా.. 238 పరుగులు తేడాతో విజయదుందుభి మోగించింది. మధ్యప్రదేశ్ ఎదుట రెస్టాఫ్ ఇండియా నిలిపిన 437 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఓవర్ నైట్ స్కోరు 81-2 తో ఐదో రోజు ఆట ఆరంభించిన మధ్యప్రదేశ్.. ఉదయం అదే స్కోరు వద్ద కెప్టెన్ హిమాన్షు మంత్రి (51) వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వత యశ్ ధుబే (8), అమన్ సోలంకి (31), సారాన్ష్ జైన్ (7) లు కూడా విఫలమయ్యారు.
ఆదుకుంటాడనుకున్న హర్ష్ (48) కూడా ఔటవడంతో మధ్యప్రదేశ్ ఓటమి ఖాయమైంది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్, శేష్, పుల్కిత్ నారంగ్ లు తలా రెండు వికెట్లు తీయగా సౌరభ్ కుమార్ మూడు వికెట్లు, నవదీప్ సైనీకి ఒక వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్టాఫ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 484 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153) సెంచరీ చేయగా యశస్వి జైస్వాల్ (213) డబుల్ సెంచరీతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో మధ్యప్రదేశ్.. 294 పరుగులకే ఆలౌట్ అయింది. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రెస్టాఫ్ ఇండియా.. రెండో ఇన్నింగ్స్ లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా యశస్వి సెంచరీ (144) బాదాడు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా.. మధ్యప్రదేశ్ ముందు 437 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.
కాగా రంజీ ఛాంపియన్ గా ఉండి ఇరానీ కప్ ను గెలిచిన జట్లు ఇదివరకు మూడే మూడు. గతంలో రైల్వేస్ 2002, 2005 లో కర్నాటక 2013, 2014లో విదర్భ 2017, 2018లో ఇరానీ కప్ లు విజయం సాధించాయి.