తొలి అడుగు ఘనంగా.. ముంబై బంపర్ విక్టరీ.. గుజరాత్‌కు దారుణ పరాభవం..

Published : Mar 04, 2023, 11:11 PM IST
తొలి అడుగు ఘనంగా.. ముంబై బంపర్ విక్టరీ.. గుజరాత్‌కు దారుణ పరాభవం..

సారాంశం

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో   ముంబై ఇండియన్స్ తమ తొలి అడుగు ఘనంగా వేసింది. మొదట బ్యాటింగ్ లో చెలరేగిన ఆ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ గుజరాత్‌ను బెంబేలెత్తించింది. తొలి మ్యాచ్ లో  గుజరాత్ దారుణంగా ఓడింది. 

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లోనూ మొదటి అడుగును ఘనంగా వేసింది.  బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో రెచ్చిపోయిన ఆ జట్టు.. గుజరాత్ జెయింట్స్ పై  144 పరుగుల భారీ తేడాతో గెలిచింది.  తొలుత బ్యాటింగ్ చేసిన  ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి   207 పరుగులు చేసింది. 208 పరుగుల క లక్ష్య  ఛేదనలో గుజరాత్.. 15.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పయి 64 పరుగులకే పరిమితమైంది.  ముంబై బౌలర్ల ధాటికి గుజరాత్ కనీస పోటీని కూడా ఇవ్వలేక చతికిలపడింది. 

ముంబై నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో   గుజరాత్ కథ తొలి ఓవర్లోనే తేలిపోయింది.   మొదటి ఓవర్లోనే ఆ జట్టు సారథి గాయంతో వెనుదిరగగా  ఆ జట్టు బ్యాటర్లు కూడా  అలా వచ్చి ఇలా వెళ్లారు. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి  గుజరాత్ ను దెబ్బతీశారు.

ముంబై   ప్లేయర్లు అటు బ్యాటింగ్ తో పాటు  బౌలింగ్ లోనూ మెరిసి అభిమానులను అలరిస్తే  గుజరాత్ ఆటగాళ్లు మాత్రం అన్ని విభాగాల్లో విఫలమై  అభిమానులను నిరాశకు గురి చేశారు.  బ్యాటింగ్ లో ఆ జట్టు బ్యాటర్  హేమలత  (23 బంతుల్లో 29, 1 ఫోర్, 2 సిక్సర్లు) ఒక్కతే  కాస్త  బెటర్ గా ఆడింది.  మిగిలిన పది మందిలో చివరి వరుస బ్యాటర్ మోనికా పటేల్ (10) తప్ప మిగిలిన 8 మంది రెండంకెల  స్కోరు చేయలేకపోవడం గమనార్హం.  అదీగాక ఆ జట్టులో ముగ్గురు డకౌట్ అయ్యారు. 

భారీ లక్ష్య ఛేదనలో  గుజరాత్ కు  తొలి ఓవర్లోనే ఊహించని షాక్ తాకింది. ముంబై బౌలర్ నటాలి సీవర్ వేసిన తొలి ఓవర్లో  నాలుగో బంతికి గుజరాత్ సారథి బెత్ మూనీ.. కవర్ పాయింట్ దిశగా షాట్ ఆడింది.  పరుగు తీయడానికి ముందుకు కదిలిన ఆమె.. కాలు బెనకడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో ఆమె  పెవిలియన్ చేరింది.  ఆ తర్వాత ఆమె మళ్లీ క్రీజులోకి రాలేదు. 

వచ్చారు.. వెళ్లారు.. 

వన్ డౌన్ లో వచ్చిన హర్లీన్ డియోల్.. పరుగుల ఖాతా తెరవకుండానే  ఔటైంది.   తొలి ఓవర్ లో ఒక పరుగుకే ఒక వికెట్.  రెండో ఓవర్ వాంగ్ వేసింది. ఆ ఓవర్లో రెండో బంతికి ప్రమాదకర  గార్డ్‌నర్  (0)  కూడా నిష్క్రమించింది.  గార్డ్‌నర్..  ఫస్ట్ స్లిప్ లో మాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చింది. సీవర్ మూడో ఓవర్లో   మూడో బంతికి  ఆంధ్రా అమ్మాయి సబ్బినేని మేఘన (2) ను  బౌల్డ్ చేసింది.  8 పరుగులకే గుజరాత్ 3వ వికెట్ కోల్పోయింది. సైకా ఇషాక్ వేసిన ఐదో ఓవర్ నాలుగో బంతికి సదర్లాండ్ (6) కూడా క్లీన్ బౌల్డ్ అయింది. తొలి పవర్ ప్లే ముగిసేటప్పటికీ  గుజరాత్.. 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 

సైకా ఇషాక్  తన రెండో ఓవర్లో  ఐదో బంతికి   వెర్హమ్  (8) ను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. తద్వారా గుజరాత్ సగం వికెట్లు నేలకూలాయి. ఆ తర్వాత వచ్చిన స్నేహ్ రాణా (1) ను కెర్  ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది. ఆమె వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి తనూజా కన్వర్ (0)  కూడా  సీవర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.  వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్న మాన్సి జోషి(6) ని  ఇషాక్   ఎల్బీగా ఔట్ చేసింది.   

ముంబై బౌలర్లలో సైకియా ఇషాక్ కు నాలుగు వికెట్లు దక్కగా  నటాలీ సీవర్, అమిలియా కెర్ కు  తలా రెండు వికెట్లు దక్కాయి.  ఇస్సీ వాంగ్ ఒక వికెట్ తీసింది. 

తొలుత  బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత  20 ఓవర్లలో  ఐదు వికెట్ల నష్టానికి  207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65, 14 ఫోర్లు) తో పాటు  ఓపెనర్ హీలి మాథ్యూస్ (31 బంతుల్లో  47,  3 ఫోర్లు, 4 సిక్సర్లు),  అమిలియా కెర్  (24 బంతుల్లో 45 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) లు రెచ్చిపోయారు. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?