
Kohli finally gets his first IPL trophy: ఆర్సీబీ కల నెరవేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చరిత్రను తిరగరాసింది. పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో ఆర్‌సీబీ అభిమానుల 17 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసిన కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు మద్దతుగా నిలిచాడు. చివరి ఓవర్లలో మంచి పరుగులు రావడంతో 190 పరులుగు చేసింది.
లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 6 పరుగుల తేడాతో మ్యాచ్ ఆర్‌సీబీ విజయంతో ముగిసింది. ఇది ఆర్సీబీకి నాల్గో ఫైనల్ కాగా, తొలిసారి టైటిల్ గెలిచింది. పంజాబ్ కింగ్స్ మాత్రం రెండోసారి ఫైనల్‌లో ఓటమి పాలైంది. దీంతో మరోసారి ఐపీఎల్ ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోయింది.
మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. 2008లో తొలి సీజన్ నుంచీ ఒకే జట్టులో కొనసాగుతూ, కెప్టెన్‌గాను వ్యవహరించిన అతను ఇప్పటిదాకా టైటిల్ గెలవలేకపోయాడు. చివరకు ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంతో కోహ్లీ భావోద్వేగానికి లోనయ్యాడు.
స్టేడియంలో జట్టు సభ్యులంతా కోహ్లీ చుట్టూ చేరి జయోత్సవాలు నిర్వహించారు. అభిమానులు కూడా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఐపీఎల్ 2025 ఫైనల్ ద్వారా ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీ లకు ఇది చారిత్రక విజయం అయింది. కింగ్ కోహ్లీతో పాటు ఆర్సీబీ కల కూడా నెరవేరింది.