
IPL 2025 Prize money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ విక్టరీతో కొత్త ఛాంపియన్ గా నిలిచింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ ఆర్సీబీకి తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు.
జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు 191 పరుగుల టార్గెట్ ను ఉంచింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 43 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 26 పరుగులు, మయాంక్ అగర్వాల్ 24 పరుగులు, లివింగ్ స్టోన్ 25 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. జితేష్ శర్మ 24 పరుగులు సాధించాడు.
పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అతను చివరి ఓవర్ అద్భుతంగా వేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే, మొత్తంగా తన 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. జేమీసన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అజ్మతుల్లా ఓమర్జాయ్, వైశాఖ్, చాహల్ లు తలా ఒక వికెట్ తీసుకున్నారు.
191 పరుగుల భారీ టార్గెట్ ముందు పంజాబ్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. మిడిల్ ఓవర్లతో పాటు చివరలో కూడా మంచి బౌలింగ్ తో ఆర్సీబీ పంజాబ్ ను దెబ్బకొట్టింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయాడు. ప్రియాంశ్ ఆర్య 24 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26 పరుగులు చేశారు. జోష్ ఇంగ్లీస్ 39 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. చివరి చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. శశాంక్ సింగ్ చివరి వరకు క్రీజులో ఉండి హాఫ్ సెంచరీ కొట్టాడు కానీ, పంజాబ్ కు విజయాన్ని అందించలేకపోయాడు.