RCBvsKXIP: గేల్ వచ్చాడు, పంజాబ్ గెలిచింది... కింగ్స్ చేతిలో మళ్లీ ఓడిన రాయల్స్...

By team teluguFirst Published Oct 15, 2020, 11:03 PM IST
Highlights

మరోసారి రాణించిన మయాంక్ అగర్వాల్...

కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్... క్రిస్ గేల్ ‘సిక్సర్ల’ సునామీతో వన్‌సైడెడ్‌గా మారిన భారీ స్కోరింగ్ మ్యాచ్...

ఆఖరి బంతి దాకా హైడ్రామా... సిక్సర్‌తో ముగించిన నికోలస్ పూరన్...

IPL 2020 సీజన్‌లో వరుస పరాజయాలకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. మొదటి విజయం దక్కిన రాయల్ ఛాలెంజర్స్‌పైన రెండో విజయాన్ని అందుకుంది కెఎల్ రాహుల్ టీమ్. 172 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 8 వికెట్ల తేడాతో టార్గెట్‌ను అందుకుని ఘనవిజయం సాధించింది. తేలిగ్గా గెలుస్తుందని అనుకున్న మ్యాచ్‌ను ఆఖరి బంతితాకా తీసుకొచ్చి, ఉత్కంఠ రేపారు పంజాబ్ ప్లేయర్లు.

ఆఖరి ఓవర్‌కి 2 పరుగులు కావాల్సిన దశ నుంచి చాహాల్ బౌలింగ్ కారణంగా ఆఖరి బంతికి ఒక పరుగు దాకా ఉత్కంఠ సాగింది. అయితే ఐదో బంతికి గేల్ రనౌట్ తర్వాత వచ్చిన పూరన్, ఆఖరి బంతికి సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన రాహుల్, మరోసారి మంచి ఇన్నింగ్స్‌‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి అవుట్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్ వచ్చిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్, కెప్టెన్ కెఎల్ రాహుల్‌తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ నిర్మించాడు.

గేల్ తన స్టైల్‌లో మొదట నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, ఆ తర్వాత గేర్ మార్చి సిక్సర్ల వర్షం కురిపించాడు.  ఆర్‌సీబీ బౌలర్లు ఎంత ప్రయత్నించినా కేవలం ఒకే వికెట్ తీయగలిగారు. క్రిస్ గేల్ 45 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్సర్లతో 53 పరుగులు చేసి ఆఖరి రెండు బంతుల్లో ఒక పరుగు కావాల్సిన దశలో రనౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ 49 బంతుల్లో ఓ ఫోర్, 5 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. గేల్ సునామీ కారణంగా ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో రెండో ఓటమి అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

click me!