RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్ మరోసారి తమకు హోం గ్రౌండ్ తో తిరుగులేదని నిరూపిస్తూ విజయం సాధించింది.
CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ శుక్రవారం ఘనంగా ప్రారంభం అయింది. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. మరోసారి ఎంఎస్ ధోని టీమ్ చెన్నై తన హోం గ్రౌండ్ లో తమకు తిరుగులేదని నిరూపించింది. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ లో గెంగళూరుపై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ తొలి విజయాన్ని అందుకుంది. 174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభం అందించారు. డుప్లెసిస్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 38 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్ లు ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు. 5వ ఓవర్ లో డుప్లెసిస్ ఔట్ అయిన తర్వాత అదే ఓవర్ లో రజత్ పటిదార్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్ ను కూడా కోల్పోయి కష్టాల్లో పడింది. 77 పరుగుల వద్ద కోహ్లీ, వెంటనే కామెరాన్ గ్రీన్ ఔట్ అయ్యారు.
కష్టసమయంలో దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ లో బెంగళూరు టీమ్ కు మంచి స్కోర్ అందించారు. సూపర్ ఇన్నింగ్స్ తో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ 6వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీకి 173 పరుగులు అందించారు. ఇందులో దినేష్ కార్తీక్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనుజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి మ్యాచ్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. బౌలింగ్ విషయానికొస్తే ముస్తాబిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు. తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లు ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు.
174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (15 పరుగులు), రచిన్ రవీంద్ర (37 పరుగులు) చెన్నైకి మంచి శుభారంభం అందించారు. రహానే 27 పరుగులు, డారిల్ మిచెల్ 22 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా (25 పరుగులు నాటౌట్), శివం దూబే (34 పరుగులు నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి చెన్నైకి విజయాన్ని అందించారు. 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై చెన్నై విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు, యశ్ దయాల్, కరణ్ శర్మలు చెరో వికెట్ తీశారు.