
ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్ గెలిచి జోష్ మీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళరుకి గట్టి షాక్ తగిలింది. ఆర్‌సీబీ బ్యాటర్ రజత్ పటిదార్, గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మొదటి మ్యాచ్‌కి దూరమైన పటిదార్, త్వరలో రీఎంట్రీ ఇస్తాడని ఆర్‌సీబీ ఆశలు పెట్టుకున్నా, అది వీలు కాలేదు..
‘దురదృష్టవశాత్తు ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి రజత్ పటిదార్ దూరమయ్యాడు. అరకాలి మడమ గాయంతో తీవ్రంగా బాధపడుతున్న రజత్ పటిదార్ వీలైనంత త్వరగా కోలుకోవాలని మేం ఆశిస్తున్నాం. కోచ్‌లు, మేనేజ్‌మెంట్ కలిసి రజత్ పటిదార్‌కి రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని ఇప్పుడే ఎంపిక చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు...’ అంటూ ట్వీట్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో వైద్యం తీసుకుంటున్న రజత్ పటిదార్ గాయన్ని ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ సంజయ్ భంగర్ సమీక్షిస్తున్నారు.
కాలి మడమ గాయంతో బాధపడుతున్న రజత్ పటిదార్, కోలుకోవడానికి నెలన్నరకు పైగా సమయం పడుతుందని తేల్చారు వైద్యులు. ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ చేసిన రజత్ పటిదార్, రంజీ ట్రోఫీ 2023 సీజన్‌లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు...
ఈ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాకి ఎంపికైన రజత్ పటిదార్, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకోలేకపోయాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడడంతో అతని ప్లేస్‌లో రజత్ పటిదార్‌ని తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని రజత్ పటిదార్‌ని గాయపడిన షాబజ్ అహ్మద్ ప్లేస్‌లో రిప్లేస్‌మెంట్‌గా తీసుకొచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అతను సెంచరీతో చెలరేగి, తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు.
మొదటి మ్యాచ్‌లో క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రీస్ తోప్లే, భుజం ఎముక పక్కకు జరిగింది. అతను మిగిలిన మ్యాచుల్లో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమే. అలాగే జోష్ హజల్‌వుడ్ గాయంతో బాధపడుతూ సగం మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 6న కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది ఆర్‌సీబీ.