రోహిత్‌ శర్మని ‘వడాపావ్’ అంటూ తిట్టిన వ్యక్తిపై దాడి చేసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్... పరిస్థితి విషమం...

Published : Apr 04, 2023, 04:35 PM IST
రోహిత్‌ శర్మని ‘వడాపావ్’ అంటూ తిట్టిన వ్యక్తిపై దాడి చేసిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్...  పరిస్థితి విషమం...

సారాంశం

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 1 పరుగు చేసి అవుటైన రోహిత్ శర్మ.. రోహిత్‌ని ‘వడాపావ్’ అంటూ తిడుతూ గేలిన చేసిన అభిమాని! అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన రోహిత్ ఫ్యాన్స్.. 

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోహిత్ శర్మ టైమ్ అస్సలు బాగోలేదు. మునుపటిలా పరుగులు చేయలేకపోతున్న రోహిత్ శర్మ, కెప్టెన్‌గా టీమ్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది ముంబై ఇండియన్స్...

బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 10, కామెరూన్ గ్రీన్ 5, సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు చేయగా కెప్టెన్ రోహిత్ శర్మ 10 బంతులు ఆడి 1 పరుగుకే అవుట్ అయ్యాడు..

ఇన్నింగ్స్ తొలి బంతికే సింగిల్ తీసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత 9 బంతులు ఫేస్ చేసినా పరుగులు చేయలేకపోయాడు. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. రోహిత్ అవుటై పెవిలియన్ చేరుతున్న సమయంలో కొందరు అభిమానులు, ‘వడాపావ్.. వడాపావ్’ అంటూ అతన్ని అవమానించారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది..

ముంబైకి చెందిన రోహిత్ శర్మకు వడాపావ్ అంటే చాలా ఇష్టం. అలాగే రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఎన్నో ఏళ్లుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది రోహిత్‌ని ‘వడాపావ్’ అని ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఇలా ప్రత్యేక్షంగా దూషించడం హాట్ టాపిక్ అయ్యింది..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోహిత్ శర్మను తిట్టిన గ్యాంగ్‌లో ఓ వ్యక్తి ( పేరు శుభం తక్రాల్)ని గుర్తించిన ‘హిట్‌మ్యాన్’ అభిమానులు, బెంగళూరులో అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ అభిమాని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స చెందుతున్నాడు. దాదాపు 8 నుంచి 10 మంది రోహిత్ అభిమానులు కలిసి ఒక్కసారిగా దాడి చేయడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం...

ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. టీమిండియా ఆడే మ్యాచుల సమయంలో దేశం ఓడినా పట్టించుకోని చాలా మంది కుర్రాళ్లు, ఐపీఎల్ వచ్చేసరికి తమ ఫెవరెట్ టీమ్ కోసం బట్టలు చించేసుకుంటూ ఉంటారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్‌ మధ్య మ్యాచుల సమయంలో అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి..

అయితే ఇలా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దాడులు జరగడం ఐపీఎల్ అభిమానం, పిచ్చిగా మారుతుందనే విషయానికి సంకేతం. ఐదు సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, గత సీజన్‌లో ఆఖరి సీజన్‌లో నిలిచింది. ఈసారి టైటిల్ గెలవకపోయినా దేశానికి కానీ, ‘వడాపావ్’ అంటూ గేలిచేసిన ఆ అభిమానికి కానీ వచ్చే నష్టమేమీ లేదు. మహా అయితే ముంబై టీమ్ మీద బెట్టింగ్ వేసి ఉంటే ఆ డబ్బులు పొగొట్టుకుంటాడంతే. ఆ మాత్రం దానికి ఇలాంటి విపరీత చేష్టలు చేయడం మానుకోవాలని హితవు చేస్తున్నారు క్రికెటర్లు.. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఐపీఎల్ ముద్దు.. హనీమూన్ వద్దు.. నమ్మకద్రోహం చేసిన ఆసీస్ ప్లేయర్.. పెద్ద రచ్చ జరిగేలా ఉందిగా
విదేశీ లీగ్‌ల్లో ఆడనున్న రో-కో.. ఐపీఎల్ చైర్మన్ ఏమన్నారంటే.?