వెంటవెంటనే 3 వికెట్లు తీసిన అశ్విన్.. 400 దాటేసిన ఆస్ట్రేలియా! ఇంకా క్రీజులోనే ఉస్మాన్ ఖవాజా...

Published : Mar 10, 2023, 01:56 PM ISTUpdated : Mar 10, 2023, 02:02 PM IST
వెంటవెంటనే 3 వికెట్లు తీసిన అశ్విన్.. 400 దాటేసిన ఆస్ట్రేలియా! ఇంకా క్రీజులోనే ఉస్మాన్ ఖవాజా...

సారాంశం

12 ఏళ్లలో ఇండియాలో 400లకు పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి విదేశీ బ్యాటర్‌గా ఉస్మాన్ ఖవాజా రికార్డు... వెంటవెంటనే 3 వికెట్లు తీసి టీమిండియాకి ఆశలు రేపిన రవిచంద్రన్ అశ్విన్.. 

అహ్మదాబాద్ టెస్టులో ఎట్టకేలకు భారత బౌలర్ల ప్రయత్నం ఫలించింది. తొలి రోజు ఆఖరి సెషన్‌లో, రెండో రోజు తొలి సెషన్‌లో వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, ఎట్టకేలకు రెండో సెషన్‌లో వికెట్లు రాబట్టగలిగారు. ఐదో వికెట్‌కి 208 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కామెరూన్ గ్రీన్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా...

170 బంతుల్లో 18 ఫోర్లతో 114 పరుగులు చేసిన కామెరూన్ గ్రీన్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇండియాలో ఆస్ట్రేలియాకి ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 1979-80 పర్యటనలో ఆస్ట్రేలియా ప్లేయర్ హ్యూజ్- ఆలెన్ బోర్డర్ కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టాప్‌లో ఉన్నారు.  ఆ రికార్డును 14 పరుగుల తేడాతో మిస్ చేసుకుంది కామెరూన్ గ్రీన్ - ఉస్మాన్ ఖవాజా జోడి...

కామెరూన్ గ్రీన్ అవుటైన తర్వాత నాలుగో బంతికి అలెక్స్ క్యారీని డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. నాలుగు బంతులాడిన అలెక్స్ క్యారీ, భారీ షాట్ ఆడేందుకు బంతిని గాల్లోకి లేపి అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గత 6 ఇన్నింగ్స్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ అవుట్ కావడం ఇది ఐదోసారి...

ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసిన తర్వాత కూడా అశ్విన్‌ని తప్పించి, అతని ప్లేస్‌లో మహ్మద్ షమీని బౌలింగ్‌కి దించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. మరో ఎండ్‌లో బౌలింగ్‌కి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్ వికెట్ పడగొట్టాడు. 20 బంతుల్లో 6 పరుగులు చేసిన మిచెల్ స్టార్క్, అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజా క్రీజులో కుదురుకుపోయాడు. గత 12 ఏళ్లలో ఇండియాలో 400లకు పైగా బంతులు ఫేస్ చేసిన ప్రత్యర్థి బ్యాటర్‌గా నిలిచాడు ఉస్మాన్ ఖవాజా. ఇంతకుముందు చివరిగా 2010 ఫిబ్రవరిలో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హషీం ఆమ్లా 473 బంతులాడి 253 పరుగులు చేశాడు.  ఇండియాలో 400లకు పైగా బంతులు ఎదుర్కొన్న తొలి ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజానే... 

142 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ ఖవాజా 412 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లతో 174 పరుగులు చేసి క్రీజులో ఉండగా మరో ఎండ్‌లో నాథన్ లియాన్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 111 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు. 173 ఇన్నింగ్స్‌ల తర్వాత టెస్టుల్లో అత్యధిక 3+ వికెట్ల ప్రదర్శన ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. ఇంతకుముందు ముత్తయ్య మురళీధరన్ 121 సార్లు ఈ ఫీట్ సాధిస్తే, రవి అశ్విన్ 89 సార్లు ఈ ఫీట్ సాధించాడు. అనిల్ కుంబ్లే 88, డేల్ స్టెయిన్ 85 సార్లు ఈ ఫీట్ సాధించి తర్వాత ప్లేసుల్లో ఉన్నారు. 

ఒకే టెస్టులో రెండు సెషన్లు వికెట్ తీయలేకపోయింది టీమిండియా. స్వదేశంలో గత ఏడేళ్లలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కేవలం 2 సెషన్లలో మాత్రమే భారత బౌలర్లు వికెట్ తీయలేకపోగా, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒకే టెస్టులో రెండు సెషన్లు భారత బౌలర్లు వికెట్ తీయలేకపోవడం విశేషం.. 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !