నెట్ బౌలర్‌గా రావాలని బరోడా స్పిన్నర్‌ని కోరిన ఆస్ట్రేలియా టీమ్... ఆఫర్‌ని తిరస్కరించిన మహేశ్ పిథియా..

By Chinthakindhi Ramu  |  First Published Oct 1, 2023, 12:41 PM IST

అశ్విన్ కార్భన్ కాపీలా బౌలింగ్ చేసే బరోడా బౌలర్ మహేష్ పిథియాని నెట్ బౌలర్‌గా రావాలని కోరిన క్రికెట్ ఆస్ట్రేలియా... ఆఫర్ తిరస్కరించిన యంగ్ స్పిన్నర్.. 


2019లో వన్డే వరల్డ్ కప్ మిస్ అయిన ఆస్ట్రేలియా, ఈసారి ఆరో టైటిల్ కోసం ఆశగా బరిలో దిగుతోంది. ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న ఆస్ట్రేలియా, అక్టోబర్ 8న చెన్నైలో టీమిండియాతో తొలి మ్యాచ్ ఆడనుంది..

చెన్నై పిచ్‌, స్పిన్నర్లకు చక్కగా అనుకూలిస్తుంది. భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఆస్ట్రేలియా ప్రధాన బ్యాటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై అదిరిపోయే రికార్డు ఉంది.. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఆసీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు..

Latest Videos

undefined

రవిచంద్రన్ అశ్విన్‌ని ఫేస్ చేయడానికి వీలుగా, అచ్చు అశ్విన్ కార్భన్ కాపీలా బౌలింగ్ చేసే బరోడా బౌలర్ మహేష్ పిథియాని నెట్ బౌలర్‌గా నియమించుకోవాలని భావించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో ఆసీస్ టీమ్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించాడు మహేష్..

అయితే అప్పుడు ఆసీస్ టీమ్‌కి నెట్ బౌలర్‌గా వ్యవహరించిన మహేష్, వన్డే వరల్డ్ కప్ ముందు ఆసీస్ టీమ్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశాడు. 

‘వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా నెట్ బౌలర్‌గా రావాలని ఆఫర్ వచ్చింది. అది మంచి ఆఫరే కానీ దేశవాళీ టోర్నీల్లో బరోడా కోసం ఆడుతున్నా. ఈ సమయంలో టీమ్‌కి దూరంగా ఉండడం కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ ఇచ్చిన ఆఫర్‌ని తిరస్కరించాను..

అక్షర్ పటేల్ ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ని సెలక్ట్ చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన వెంటనే నాకు, ఆసీస్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. అంతర్జాతీయ టీమ్స్‌తో కలిసి పని చేయడం చాలా గొప్ప అవకాశం. అయితే దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండడం నా ప్రథమ కర్తవ్యం..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో నెట్స్‌లో మొదటి రోజే స్టీవ్ స్మిత్‌ని ఐదు- ఆరు సార్లు అవుట్ చేశాను. అశ్విన్‌ని కలిసిన వెంటనే ఆయన పాదాలకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నా. ఆయన నా రోల్ మోడల్.. ’ అంటూ కామెంట్ చేశాడు మహేశ్ పిథియా..

2015 వన్డే వరల్డ్ కప్‌‌లో ఆస్ట్రేలియా జరిగిన సెమీ ఫైనల్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్, 42 పరుగులు ఇచ్చి గ్లెన్ మ్యాక్స్‌వెల్ వికెట్ తీశాడు. 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అశ్విన్‌తో ఓపెనింగ్ స్పెల్ వేయించాడు ఎమ్మెస్ ధోనీ..

ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు రవిచంద్రన్ అశ్విన్. షేన్ వాట్సన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, సెంచరీ చేసిన ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ని కూడా అవుట్ చేశాడు. 

click me!