మరోసారి రషీద్ ఖాన్‌కి టీ20 కెప్టెన్సీ... మహ్మద్ నబీ ప్లేస్‌లో ఆఫ్ఘాన్‌ టీ20 కెప్టెన్‌గా పగ్గాలు...

By Chinthakindhi RamuFirst Published Dec 29, 2022, 5:11 PM IST
Highlights

మహ్మద్ నబీ స్థానంలో ఆఫ్ఘాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. గతంలో కెప్టెన్‌గా చేసి, బోర్డుపై అలిగి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న రషీద్ ఖాన్.. 

ఆఫ్ఘనిస్తాన్ యంగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ మరోసారి టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత ఆఫ్ఘాన్ టీ20 కెప్టెన్సీకి రాజీనామా సమర్పించాడు మహ్మద్ నబీ. అతని ప్లేస్‌లో రషీద్ ఖాన్, టీ20 కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

2019లో ఆఫ్ఘాన్‌కి మొట్టమొదటిసారిగా టీ20 కెప్టెన్‌గా వ్యవహరించాడు రషీద్ ఖాన్. అతి పిన్న  వయసులో అంతర్జాతీయ టీమ్‌కి కెప్టెన్సీ చేసిన ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు రషీద్ ఖాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం క్రియేట్ చేశాడు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి జట్టును ఎంపిక చేసిన సమయంలో బోర్డు తనతో సంప్రదింపులు చేయలేదని మనస్థాపం చెంది, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు రషీద్ ఖాన్. మళ్లీ రెండేళ్లకు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోబోతున్నాడు రషీద్ ఖాన్...

ప్రస్తుతం వరల్డ్ నెం.2 ర్యాంకులో ఉన్న రషీద్ ఖాన్, టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్ఘాన్ టీమ్‌ని నడిపిస్తాడని భావిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూఏఈతో కలిసి 3 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది ఆఫ్ఘాన్...

74 అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడి 122 వికెట్లు తీసిన రషీద్ ఖాన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ 134 వికెట్లు తీయగా, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 128 వికెట్లతో రషీద్ ఖాన్ కంటే ముందున్నారు...

సౌతాఫ్రికా20 లీగ్‌లో ముంబై కేప్‌టౌన్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రషీద్ ఖాన్, ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘కెప్టెన్సీ అనేది చాలా పెద్ద బాధ్యత. నా దేశానికి ఇంతకుముందు కూడా కెప్టెన్‌గా వ్యవరించాను. ఇప్పుడు ఆఫ్ఘాన్ టీమ్ చాలా పటిష్టంగా ఉంది. జట్టు ప్లేయర్లు అందరూ సమిష్టిగా రాణిస్తున్నారు. కలిసి కట్టుగా రాణించి దేశం గర్వించే విధంగా ఆడాలని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రషీద్ ఖాన్..

ఆసియా కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా ఎంట్రీ ఇచ్చింది ఆఫ్ఘాన్. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం అందుకున్నా... ఆ తర్వాత వరుస పరాజయాలతో సూపర్ 4 స్టేజీ నుంచే నిష్కమించింది ఆఫ్ఘాన్. అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారీ అంచనాలతో అడుగుపెట్టింది ఆస్ట్రేలియా...

అయితే ఐదు మ్యాచుల్లో 3 పరాజయాలు అందుకున్న ఆఫ్ఘాన్, ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది. మిగిలిన రెండు మ్యాచులు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. ఈ పరాజయాలతో మహ్మద్ నబీ, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. 

click me!