IPL 2021 RR vs SRH: ప్లే ఆఫ్స్ ఆశలతో రాజస్థాన్.. పరువు కోసం హైదరాబాద్..

By team teluguFirst Published Sep 27, 2021, 7:00 PM IST
Highlights

IPL 2021 RR vs SRH: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో భాగంగా  మరికొద్దిసేపట్లో రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals), సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers hyderabad) ల మధ్య పోరుకు తెరలేవనుంది. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే సంజూ శాంసన్ సేనకు ఈ మ్యాచ్ కీలకం కానున్నది. 

ఐపీఎల్ లో అట్టడుగు నుంచి రెండు స్థానాల్లో ఉన్న జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 7.30 కు మొదలుకానున్న 40వ మ్యాచ్ లో గెలవడం రాజస్థాన్ రాయల్స్ కు అత్యంత  కీలకం. ఈ మ్యాచ్ లో గెలిచి నిలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. కాగా, టాస్ గెలిచిన రాజస్థాన్.. బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో అత్యంత పేలవంగా ఆడి తొమ్మిది మ్యాచ్ లకు గాను ఎనిమిదింటిలో ఓడిన సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు దూరమైనా గౌరవం కోసం పోరాడనున్నది. ఈ మ్యాచ్ లలోనైనా గెలిచి పరాజయాల పరంపరకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నది. 

సంజూ సారథ్యంలోని రాయల్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమర్థంగా ఉన్నా కీలక సందర్భాల్లో వాళ్లంతా చేతులెత్తేస్తుండటం జట్టును బాధిస్తున్నది. సంజూ, డేవిడ్ మిల్లర్, లూయిస్, జైస్వాల్ వంటి హిట్టర్లు పుష్కలంగా ఉన్నా ఆ  జట్టు మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నది. బౌలింగ్ లోనూ  సకారియా, ముస్తాఫిజుర్ రాణిస్తుండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. మొదటి దశలో భాగంగా రైజర్స్ తో తలపడ్డ రాజస్థాన్.. 55 పరుగుల తేడాతో విజయం సాధించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.  కానీ నేటి మ్యాచ్ లో  గాయం కారణంగా కార్తీక్ త్యాగి మ్యాచ్ కు దూరమయ్యాడు.అతడి స్థానంలో క్రిస్ మోరిస్ జట్టుతో చేరాడు. 

మరోవైపు  కేన్ విలియమ్సన్  నేతృత్వంలోని హైదరాబాద్ జట్టు.. అన్ని రంగాల్లోనూ విఫలమవుతున్నది. అభిమానులు కేన్ మామ, వార్నర్ అన్న పిలుచుకునే కీ ప్లేయర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఈ నామమాత్రపు మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘మిడిల్ ఆర్డర్ జాతి రత్నాలు’ మనీష్ పాండే, కేదార్ జాదవ్ లను రైజర్స్ పక్కనబెట్టింది. వారి స్థానంలో ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ తుది జట్టులో చేరారు. గాయంతో బాధపడుతున్న వార్నర్ స్థానంలో జేసన్ రాయ్ ఆడనున్నాడు. ఖలీల్ స్థానంలో కౌల్  చేరాడు.


జట్లు:
రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (c&wc), లివింగ్ స్టోన్, లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, సకారియా, ఉనద్కత్, ముస్తాఫిజుర్

సన్ రైజర్స్: జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (wc), కేన్ విలియమ్సన్ (c), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ

click me!