kevin Pietersen: అందుకే సంజూ శాంసన్ విఫలమవుతున్నాడు.. RR కెప్టెన్ పై పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు

By team teluguFirst Published Sep 27, 2021, 6:15 PM IST
Highlights

IPL 2021: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (sanju samson) పై ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో స్థిరంగా రాణిస్తున్న శాంసన్.. టీమ్ ఇండియాలో మాత్రం ఎందుకు వైఫల్యం చెందుతున్నాడో పీటర్సన్ వివరించాడు. 

కేరళకు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, రాజస్థాన్ రాయల్స్ (rajasthan royals) కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్ కు  టాలెంట్ లో కొదవ లేదు. బరిలోకి దిగాడంటే ఎంతటి భీకర బౌలర్ బౌలింగ్ నైనా తుత్తునీయలు చేసే సత్తా అతడి  సొంతం. ఐపీఎల్ లో శాంసన్ మెరుపులు చూసినవారంతా.. అతడు మరో ధోని (dhoni) అవుతాడని భావించారు. కానీ అతడి దురదృష్టమో ఏమో గానీ భారత జట్టులోకి రావడమే ఆలస్యంగా వచ్చాడు. తీరా జట్టులో స్థానం దక్కినా అక్కడ పెద్దగా సఫలం కాలేదు. 

తాజాగా  ఇదే విషయాన్ని కెవిన్ పీటర్సన్ ఎత్తి చూపాడు. శాంసన్ ఆటంటే తనకు ఇష్టమన్న పీటర్సన్.. భారత జట్టులో అతడు ఎందుకు విఫలమవుతున్నాడో వివరించే ప్రయత్నం చేశాడు. ‘శాంసన్ అద్భుతమైన బ్యాటర్. అందులో సందేహమే లేదు.  అతడు ఆడే పుల్ షాట్లు, స్పిన్నర్లను ఎదుర్కునే విధానం చూడముచ్చట గొలుపుతాయి.  శాంసన్ సెంచరీ చేసినప్పుడు చూడటం ఒక అదృష్టంగా భావిస్తాన్నేను. కానీ భారత క్రికెట్ జట్టులో మాత్రం అతడు నిలకడలేమి ప్రదర్శిస్తున్నాడు’ అని అన్నాడు. 

 

రాజస్థాన్ కు అతడు కెప్టెన్ గా వ్యవహరించడమే  అతడిని సూపర్ స్టార్ గా ఎదగకుండా అడ్డుపడుతుందని పీటర్సన్ అన్నాడు. బ్యాటింగ్ చేసేప్పుడు సారథ్య బాధ్యతల గురించి సంజూ ఎక్కువగా ఆలోచిస్తున్నాడని, దానిని వదిలిపెట్టాలని అతడికి సూచించాడు. ఈ విషయంలో పంజాబ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (kl rahul) ను ఆదర్శంగా తీసుకోవాలని శాంసన్ కు సూచన చేశాడు. 

రాహుల్ బ్యాటింగ్ చేసే సమయంలో ‘నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు నా పని బ్యాటింగ్ చేయడమే. కెప్టెన్ సంగతి తర్వాత.. ’ అనే విధంగా ఉంటాడని పీటర్సన్ అన్నాడు. 

click me!