Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్ ప‌ద‌వీకాలం పెంపు.. బీసీసీఐ ఆఫర్, నిర్ణయం ఆయన చేతుల్లోనే

By Siva Kodati  |  First Published Nov 29, 2023, 3:26 PM IST

టీమిండియా హెడ్ కోచ్‌గా మరింత కాలం కొనసాగాల్సిందిగా రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదించింది. అయితే ఈ ఆఫర్‌ను ఆయన అంగీకరించాడా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు.


టీమిండియా హెడ్ కోచ్‌గా మరింత కాలం కొనసాగాల్సిందిగా రాహుల్ ద్రావిడ్‌కు బీసీసీఐ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినట్లుగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదించింది. పదవీ కాలం ముగియడంతో గత వారం ద్రావిడ్‌ను బోర్డు సంప్రదించింది. అయితే ఈ ఆఫర్‌ను ఆయన అంగీకరించాడా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. గత రెండేళ్లుగా జట్టు నిర్మాణం, ఆరోగ్యకరమైన వాతావరణం , సాధించిన విజయాల నేపథ్యంలో ద్రవిడ్‌ను మరికొంతకాలం కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా కథనాలు వస్తున్నాయి.

టీమిండియా హెడ్ కోచ్‌గా మరికొంతకాలం కొనసాగేందుకు ద్రవిడ్ అంగీకరిస్తే .. డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికా పర్యటనతో ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ సిరీస్ అదే అవుతుంది. ఈ సందర్భంగా భారత్ మూడు వన్డేలు, టీ20లు,  రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికాలు ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను , దానికి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ ఆడనుంది. 

Latest Videos

2021 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియాకు రవిశాస్త్రి కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్ సూపర్ 12 దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఆ తర్వాత రెండేళ్ల కాలానికి ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇటీవల స్వదేశంలో ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. నాటితో ద్రవిడ్ కాంట్రాక్ట్ కూడా ముగిసింది. జూన్‌లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోనూ భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఒకవేళ ద్రావిడ్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంటే విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్), పరాస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్) , టీ. దిలీప్ (ఫీల్డింగ్ కోచ్)లతో పాటు ప్రస్తుతం అసిస్టెంట్‌లుగా వున్న వారిని కూడా కొనసాగించే అవకాశం వుంది. 

వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ద్రవిడ్ మాట్లాడుతూ.. అన్ని ఫార్మాట్‌లలో భారతదేశం టాప్ ర్యాంకింగ్‌లో వున్నందుకు తాను గర్వంగా వుందన్నారు. అయినప్పటికీ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోవడం నిరాశ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన కోచ్‌గా కొనసాగడంపై ద్రవిడ్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ సన్నాహాల్లో మునిగిపోయినందున తాను దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దాని గురించి తనకు వేరే ఆలోచనలు లేవని ఆయన స్పష్టం చేశారు. 

click me!