అంపైర్లు ఆటను నిలిపివేసి వెళ్లిపోమ్నని చెప్పారు, కానీ రహానే భాయ్ మాత్రం... సిడ్నీ టెస్టులో...

By team teluguFirst Published Jan 22, 2021, 1:50 PM IST
Highlights

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో జరిగిన సంఘటన గురించి వివరించిన సిరాజ్...

ఆటను నిలిపి వెళ్లమని టీమిండియాకి అంపైర్లు సలహా...

ఆడడానికి వచ్చాం... ఆడతామని తెగేసి చెప్పిన కెప్టెన్ అజింకా రహానే...

సిడ్నీ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రేక్షకులు, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టేడియంలో కొందరు ఆస్ట్రేలియన్లు, సిరాజ్‌ను అవమానిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది.

సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం సెషన్‌తో పాటు నాలుగో రోజు ఉదయం సెషన్‌లో కూడా సిరాజ్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో కాసేపు ఆటను నిలిపివేసిన అంపైర్లు, పోలీసులను రంగంలోకి దింపి, వ్యాఖ్యలు చేస్తున్న వారిని బయటికి పంపించి వేసిన సంగతి తెలిసిందే.

ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చాడు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్...

‘ఆ సంఘటన తర్వాత నేను కెప్టెన్ అజింకా రహానేకి చెప్పాను. రహానే వెంటనే అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంపైర్లు ఆటను నిలిపివేసి, వెళ్లమని ఆఫర్ చేశాడు. అయితే రహానే మాత్రం అందుకు అంగీకరించలేదు. మేం ఆడడానికి ఇక్కడికి వచ్చాం. మేమేం తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్లలా ఎందుకు వెళ్లిపోవాలి... మేం ఆడతాం...అని అంపైర్లకు చెప్పాడు రహానే భాయ్...’ 

- మహ్మద్ సిరాజ్

అజింకా రహానే మాటలతో పోలీసులను రంగంలోకి దింపారు అంపైర్లు. సిరాజ్‌పై కామెంట్లు చేసిన ఆరుగురిని స్టేడియం బయటికి పంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత తాను మరింత దృఢంగా బౌలింగ్ చేయగలిగానని చెప్పుకొచ్చాడు సిరాజ్.

click me!