విరామం లేదు... విశ్రాంతి లేదు, ప్రతీ వికెట్ నాన్నకే అంకితం: మహ్మద్ సిరాజ్

By Siva KodatiFirst Published Jan 21, 2021, 8:09 PM IST
Highlights

ఆసీస్‌తో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడంతో భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక వ్యవహరించిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్వస్థలానికి చేరుకున్నాడు. విమానం దిగిన వెంటనే నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు.

ఆసీస్‌తో జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడంతో భారత జట్టు సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో కీలక వ్యవహరించిన హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ స్వస్థలానికి చేరుకున్నాడు.

విమానం దిగిన వెంటనే నేరుగా శ్మశానవాటికకు చేరుకున్నాడు. తన తండ్రి సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లి తన తల్లిని కలిసి ఓదార్చాడు. కాగా, సిరాజ్‌ ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వారం రోజుల్లోనే అతడి తండ్రి మహ్మద్‌ గౌస్‌ కన్నుమూశారు. క్వారంటైన్‌ ఆంక్షలు, టీమ్‌ఇండియాకు టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కలను నిజం చేసేందుకు గాను బాధను దిగమింగి ఆటను కొనసాగించాడు.

హైదరాబాద్‌కు తిరిగి రాకపోవడంతో పాటు తండ్రి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. టెస్టుల్లో అరంగేట్రం చేసి ఆఖరి టెస్టులో బౌలింగ్‌ దళాన్ని నడిపించి శెభాష్‌ అనిపించుకున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం విన్నప్పుడల్లా తండ్రి గుర్తొచ్చి సిరాజ్ కన్నీరు కార్చాడు. 

కాగా, ఇంటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహ్మద్ సిరాజ్.... తండ్రి మరణం మానసికంగా తననెంతో కలచివేసిందన్నాడు. మిత్రులు, కుటుంబ సభ్యులు, టీమ్‌ఇండియా సహచరులు తనను ఓదార్చారని పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో అనుభవించిన వేదన, సవాళ్లు తనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయని సిరాజ్ వెల్లడించాడు. హైదరాబాద్ వచ్చాక బిర్యానీ ఏం తినలేదని ... చాన్నాళ్ల తర్వాత ఇంటి భోజనం తినడం ఆనందాన్ని ఇచ్చిందని మహ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాలో సాధించిన ప్రతి వికెట్‌ను తన తండ్రికి అంకితమిచ్చానని.. తాను తీసిన 13 వికెట్లలో మార్నస్‌ లబుషేన్‌ వికెట్ ‌ఎంతో ప్రత్యేకమైనదిగా సిరాజ్ అభివర్ణించాడు. సవాళ్లంటే తనకిష్టమని, వాటిని ఎదుర్కోవడాన్ని ఆస్వాదిస్తానని తెలిపాడు.

నిజానికి తనపై కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ బయటకు ప్రదర్శించలేదన్నాడు. విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె ఇద్దరూ మంచి సారథులేనని సిరాజ్ ప్రశంసించాడు. వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, నాకూ అజింక్య ఎన్నో సలహాలు ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసం నింపాడని అతను తెలిపాడు.

విజయం దక్కించుకోవాలంటే కఠినంగా శ్రమించాలి... సవాళ్లను అధిగమిస్తేనే విజయవంతం అవ్వగలమని మహ్మద్ సిరాజ్ సూచించాడు. వచ్చే సిరీసులను తీవ్రంగా తీసుకుంటానని.. విశ్రమించే సమస్యే లేదని తెలిపాడు. 

ఐపీఎల్ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ ప్రోత్సాహాన్ని మరువలేనని సిరాజ్‌ అన్నాడు. తన ప్రదర్శన బాగాలేనప్పుడు అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు. టీమ్‌ఇండియాలో జూనియర్‌, సీనియర్‌ అన్న భేదాలేమీ ఉండవన్నాడు.

బుమ్రాతో కలిసి రెండు టెస్టులు ఆడినప్పుడు ఎంతో మద్దతుగా ఉన్నాడన్నాడు. బంతి బంతికీ సలహాలు ఇచ్చాడని పేర్కొన్నాడు. మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ వచ్చినా జట్టు యాజమాన్యం తనకు అప్పగించిన పాత్రను పోషిస్తానని సిరాజ్ స్పష్టం చేశాడు. 

ఆటపై అభిమానం, తగినంత శ్రమిస్తే ఎవరికైనా అవకాశాలు వస్తాయని యువతకు సిరాజ్ సూచనలు చేశాడు. క్రికెట్లో అవినీతి జరుగుతుంది అనడం అవాస్తవమని.. ప్రతిభ ఉంటే డబ్బులతో ఏం అవసరం అని సిరాజ్ ప్రశ్నించాడు. ఒకప్పుడు రంజీల్లో హనుమ విహారి తనకు సారథి అని ఏయే బ్యాట్స్‌మెన్‌కు ఎలాంటి బంతులు వేయాలో సలహాలు ఇచ్చేవాడని గుర్తుచేసుకున్నాడు. 

click me!