అవును, అతనలా అనడం నేను విన్నా... మైకల్ వాగన్‌‌పై జాతివివక్ష ఆరోపణలపై అదిల్ రషీద్ స్టేట్‌మెంట్...

By Chinthakindhi RamuFirst Published Nov 15, 2021, 7:18 PM IST
Highlights

ముదరుతున్న యార్క్‌షైర్ కౌంటీ క్లబ్ వివాదం... ఆసియా క్రికెటర్లను చిన్న చూపు చూసేవారని, మైకెల్ వాగన్ అలా మాట్లాడడం చాలాసార్లు విన్నానని చెప్పిన ఇంగ్లాండ్ క్రికెటర్ అదిల్ రషీద్..

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్ వివాదం రోజురోజుకీ ముదురుతున్నట్టే కనిపిస్తోంది. జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడంతో పాటు జాతి వివక్ష చూపిస్తున్నారనే కారణంగా యార్క్‌షైర్‌ క్లబ్‌పై నిషేధం విధించింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఇప్పుడు ఈ వివాదంపై ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి... కొన్నిరోజుల క్రితం ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ యార్క్‌షైర్ తరుపున ఆడిన స్పిన్నర్ అజీమ్ రఫీక్, 2018లో ఓ మ్యాచ్‌లో తన సహచర క్రికెటర్లతో పాటు, టీమ్ కోచ్ కూడా తనపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారంటూ యార్క్‌షైర్ క్లబ్‌పై ఈసీబీకి ఫిర్యాదు చేశాడు. 

దీనిపై సమగ్ర విచారణ జరిపించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, యార్క్‌షైర్ కౌంటీ క్లబ్‌పై నిషేధం విధించింది. యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్‌‌కి కూడా ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు రిపోర్టులో దాఖలైంది...

తాజాగా ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, మైకెల్ వాగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తాను కూడా విన్నానంటూ ఈసీబీ తెలిపాడు. ‘ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు యార్క్‌షైర్ తరుపున నలుగరు ఆసియా క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో వాగన్ ‘మీరు చాలా మంది ఉన్నారు. దీని గురించి ఏదైనా చేయాలి...’ అంటూ చులకనగా మాట్లాడాడు...’ అంటూ తెలియచేశాడు అదిల్ రషీద్...

‘రేసిజం ఓ క్యాన్సర్‌ లాంటిది. అది జీవితాన్ని వేధిస్తూనే ఉంటుంది. దురదృష్టవశాత్తు క్రీడల్లో కూడా ఈ మహమ్మారి వ్యాపించింది. దీన్ని సమూలంగా తొలగించడానికి ఏదైనా చేయాలి. నేను నా ఆటపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలని ప్రయత్నిస్తాను. ఇలాంటి వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని భావించాను. అయితే అజీద్ రఫీక్ చేసిన ఆరోపణలు నిజమైనని చెప్పాల్సిన బాధ్యత నాపైన ఉంది. పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని త్వరగా తేల్చి, పరిస్థితిని మారుస్తుందని భావిస్తున్నా... ఈ విషయంలో అధికారులకు సహకరించడానికి అన్ని వేళలా సిద్ధంగా ఉంటా...’ అంటూ తెలియచేశాడు అదిల్ రషీద్...

అదిల్ రషీద్ తల్లిదండ్రులు పాకిస్తాన్‌ దేశానికి చెందినవాళ్లు. ఇంగ్లాండ్‌కి వలస వెళ్లి, అక్కడే సెటిల్ అయ్యారు. అదిల్ రషీద్‌తో పాటు ఇంగ్లాండ్ జట్టులోని మరో స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కూడా పాకిస్తాన్‌ సంతతికి చెందినవాడే... 

అదిల్ రషీద్ కంటే ముందు పాకిస్తాన్ మాజీ సీమర్ రాణా నవీద్ వుల్ హసన్ కూడా మైకెల్ వాగన్, జాత్యాహంకార వ్యాఖ్యలు చేసేవాడంటూ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ సీనియర్ సభ్యుడైన అతను, ఆసియా ప్లేయర్లపై చేసే చులకన వ్యాఖ్యలు మనసు నొప్పించేవంటూ కామెంట్ చేశాడు రాణా నవీద్...

ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఆరంగ్రేటం చేసిన ఇంగ్లాండ్ పేసర్ ఓల్లీ రాబిన్‌సన్, 9 ఏళ్ల క్రితం వేసిన రేసిజం ట్వీట్లు, సెక్సిజం కామెంట్ల కారణంగా ఓ మ్యాచ్ నిషేధానికి గురయ్యారు. అతను ఆ ట్వీట్లకు బహిరంగ క్షమాపణలు చెప్పడంతో తిరిగి ఇంగ్లాండ్ తరుపున రీఎంట్రీ ఇచ్చాడు..

click me!