T20 World Cup: ఏయ్ అమిత్.. అంత తాగావా ఏంటి..? టీమిండియా మాజీ స్పిన్నర్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

By team teluguFirst Published Nov 15, 2021, 4:34 PM IST
Highlights

T20 World Cup Final 2021: టీ20 ప్రపంచకప్ విజేతగా అవతరించిన ఆస్ట్రేలియాకు ఆ దేశంలోనే కాదు.. ఇతర దేశాల తాజా, మాజీ క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ చేసిన ఓ ట్వీట్ తో అతడు ట్రోలింగ్ కు గురవుతున్నాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం  రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో Australia.. తమకు  దాయాది దేశం New Zealandను ఓడించి తమ కీర్తి కిరీటంలో మరో కప్పును చేర్చుకుంది.  ఆసీస్  విజయంపై  ఆ దేశంలోనే గాక ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ఆ జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదే క్రమంలో టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా శుభాకాంక్షలు తెలిపాడు. కానీ అక్కడే పప్పులో కాలేశాడు. అతడు చేసిన తప్పిదంతో నెటిజన్లకు మంచి సరుకు దొరికినట్టైంది. ఇంకేం.. అమిత్ మిశ్రాను ఓ ఆటాడుకుంటున్నారు. 

ఇంతకీ  Amit Mishra చేసిన తప్పిదమేమిటంటే.. నిన్న  రాత్రి మ్యాచ్  ముగిసిన అనంతరం ట్విట్టర్ వేదికగా అతడు స్పందించాడు. ఆసీస్ కు శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి న్యూజిలాండ్ కు విషెస్ చెప్పాడు. ‘ప్రపంచకప్ గెలిచినందుకు బ్లాక్ క్యాప్స్ (న్యూజిలాండ్) కు శుభాకాంక్షలు. సమిష్టి విజయం. చాలా బాగా ఆడారు’ అని ట్వీట్ చేశాడు. ఇంకేం.. బాధితులు ఎక్కడ దొరుకుతారా..? అని 24 గంటల పాటు ఆన్ లైన్ లో వేచి చూసే నెటిజనులకు అమిత్ మిశ్రా.. ఆ అర్ధరాత్రి మంచి విందు భోజనం పెట్టాడు. 

కొద్ది సేపట్లోనే ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ట్విట్టర్ లో వైరలయ్యాయి. ట్విట్టర్లో నెటిజన్లు అతడిని ఓ ఆటాడుకున్నారు. ‘ఇంత  ఎందుకు తాగావు మిశ్రా భాయ్..?’ అని ఒకరు  ‘మ్యాచ్ చూడలేదా..?’ అని మరొకరు కామెంట్లు పెట్టారు. అంతేగాక పలువురు ఆకతాయిలు దీని మీద కూడా మీమ్స్ తయారుచేసి  వైరల్ చేశారు. ఒక యూజర్ అయితే.. మిశ్రా సామాజిక వర్గం తరఫున నేను క్షమాపణలు కోరుతున్నా అని కామెంట్ చేశారు. 

తర్వాత తప్పు తెలుసుకున్న అమిత్ మిశ్రా..  ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. మళ్లీ ఆసీస్ కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీటాడు. అయినా కూడా నెటిజన్లు మిశ్రాను వదల్లేదు. 

 

Congratulations team on winning the World Cup 🏆. Great team effort. Very well played.

— Amit Mishra (@MishiAmit)

ఇక నిన్నటి మ్యాచ్ లో ఛాంపియన్ లో గర్జించిన ఆసీస్.. న్యూజిలాండ్ పై విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి  జగజ్జేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. సారథి కేన్ విలియమ్సన్ అదరగొట్టడంతో 172 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్ లో ఆసీస్ తరఫున రాణించిన మిచెల్ మార్ష్ కు  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, డేవిడ్ వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది.

click me!