
ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ లో సోమవారం మరో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. పీఎస్ఎల్ లో భాగంగా పాక్ బౌలర్ హరీస్ రౌఫ్.. తోటి ఆటగాడిపై చేయి చేసుకున్నాడు. క్యాచ్ పట్టలేదనే కారణంతో తన టీమ్ మేట్ అయిన కమ్రాన్ గులామ్ చెంప చెల్లుమనిపించాడు. క్యాచ్ వదిలేశాడన్న కోపంతో రౌఫ్ ఇలా చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు సరదాగానే కొట్టాడని కొందరు వాదిస్తున్నా.. వీడియోలో మాత్రం రౌఫ్.. కమ్రాన్ ను కావాలనే కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో అతడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీల మధ్య జరిగిన మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. టాస్ గెలిచిన పెషావర్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచులను లాహోర్ ఆటగాళ్లు మిస్ చేశారు. ఫలితంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.
అయితే పెషావర్ బ్యాటింగ్ సందర్భంగా.. హరిస్ రౌఫ్ బౌలింగ్ లో హజ్రతుల్లా జజయి పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కమ్రాన్ గులామ్ ఆ క్యాచును అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత ఓవర్ వేసిన హరిస్.. పెషావర్ బ్యాటర్ మహ్మద్ హారిస్ ను ఔట్ చేశాడు. హారిస్ ఇచ్చిన ఆ క్యాచును పవాద్ అహ్మద్ అందుకోగానే ఆటగాళ్లంతా ఒక్కచోటుకు చేరారు.
వికెట్ తీసిన రౌఫ్ ను అభినందించడానికి కమ్రాన్ కూడా అతడిదగ్గరికి వచ్చాడు. కానీ అతడిని చూడగానే కోపంతో ఊగిపోయిన రౌఫ్.. అంతకుముందు ఓవర్లో క్యాచ్ డ్రాప్ చేశాడనే కోపంతో కమ్రాన్ చెంప చెల్లుమనిపించాడు. లాహోర్ సారథి షాహీన్ అఫ్రిదితో పాటు మిగిలిన ఆటగాళ్లు అక్కడే ఉన్నా రౌఫ్ ను మాత్రం అడ్డుకోలేదు.
క్యాచ్ డ్రాప్ చేసిన బాధలో కొట్టాడనుకున్న కమ్రాన్ మాత్రం.. రౌఫ్ ను అభినందించడానికి ప్రయత్నించాడు. కానీ రౌఫ్ మాత్రం అతడి వంక కోపంగా చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిని పక్కకు నెట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఉద్దేశపూర్వకంగానే రౌఫ్.. కమ్రాన్ పై చేయి చేసుకున్నాడని పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని వాళ్లు కోరుతున్నారు. మరి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా.. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచు లో విజయం మాత్రం పెషావర్ నే వరించింది. తొలుత పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. షోయభ్ మాలిక్ (32) రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లాహోర్.. 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో మహ్మద్ హఫీజ్ (49) సాయంతో షాహీన్ అఫ్రిది మెరుపులు మెరిపించాడు. జట్టును విజయం అంచుల దాకా తీసుకువచ్చాడు. కానీ చివరికి మ్యాచ్ టై అయింది. అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. సూపర్ ఓవర్ లో పెషావర్ నే విజయం వరించింది.