
ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర పొందిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఐపీఎల్ వేలం మొదలుపెట్టిన మొదటి రోజే.. ఇషాన్ కిషన్ ని ముంబయి ఇండియన్స్ అత్యధిక ధరను కొనుగోలు చేసింది. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కోసం వేలంలో హోరాహోరీ నెలకొంది. ఎంతో పొదుపుగా డబ్బు ఖర్చు చేస్తుందని పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా ఇషాన్ కిషన్ కోసం ఓ దశలో రూ.14 కోట్ల వరకు వచ్చింది. అయితే ముంబయి ఇండియన్స్ అందరికంటే ఎక్కువగా రూ.15.25 కోట్లకు ఇషాన్ కిషన్ ను దక్కించుకుంది.
కాగా.. ముంబయి ఇండియన్స్ తనను కొనుగోలు చేయడం పై ఇషాన్ కిషన్ తాజాగా స్పందించాడు. తనను మంబయి కొనుగోలు చేస్తుందని తనకు తెలుసు అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. అయితే.. బెట్టింగ్ ధర పెరగడం మాత్రం తనను చాలా ఆందోళన పరిచిందని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు. తాను అంత ధర పలుకుతానని ఊహించలేదని.. ముంబయి ఇండియన్స్ మిగిలిన జట్టును సెలక్ట్ చేసుకోవడానికి డబ్బు అవసరమని.. కానీ.. బెట్టింగ్ అంత వరకు వెళ్లడం ఆందోళన కలిగించిందని చెప్పాడు.
తాను కూడా ముంబయి జట్టుకే వెళ్లాలని అనుకున్నానని...అయితే.. అందుకు కారణం ఉందని చెప్పాడు. ఆ జట్టుకు తన ఆట తెలుసని.. వారు తన ఆటను బాగా అర్థం చేసుకుంటారని.. ఆ ఫ్రాంఛైజీ ఎలా పనిచేస్తుంది అనే విషయం కూడా తనకు బాగా తెలుసు అని.. ఆ జట్టు తన కుటుంబంలా ఫీలయ్యానని.. అందుకే వేరే జట్టుకు వెళ్లకూడదని అనుకున్నానని చెప్పాడు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇదే జట్టులో ఉన్నానని చెప్పాడు. ఆ నాలుగేళ్లలో రెండు సార్లు ట్రోఫీ గెలిచామన్నాడు. ఆ జట్టు తనను బాగా జాగ్రత్తగా చూసుకుంటుందని.. అందుకే.. వేరే జట్టుకు వెళ్లాలని అనుకోలేదని చెప్పాడు.
విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడడంలో దిట్టగా ఇషాన్ కిషన్ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో కిషన్ కూడా ఉన్నాడు. అందుకే అతడికి అంత ధర పలికిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.