
కొన్ని దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 100 సెంచరీలు, లెక్కకు మించిన రికార్డులతో ‘క్రికెట్ దేవుడి’ గా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, క్రికెట్‌లో అందించిన సేవలకు గుర్తుగా ‘భారత రత్న’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...
ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్, ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా ఆల్కహాల్, మద్యపానం, గుట్కా వంటి అనారోగ్యానికి కారణమయ్యే బ్రాండ్లను ప్రమోట్ చేయనని చెప్పేశాడు. అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేయడం వివాదాస్పదమైంది..
ఇప్పటికే సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లు, ఆన్‌లైన్ యాప్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అయితే సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండ్ కూడా ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్‌ని ప్రమోట్ చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..
తాజాగా ముంబైలోని సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చూ కాడూ, తన అనుచరులతో కలిసి నిరసన చేపట్టాడు. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ నుంచి బెట్టింగ్‌కి మారారని, భారత రత్న అందుకున్న వ్యక్తి ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్స్‌ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని బచ్చూ కాడూ కామెంట్ చేశారు..
సచిన్ టెండూల్కర్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటన నుంచి తప్పుకోకపోతే.. భారత రత్న అవార్డును తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశాడు బచ్చూ కాడూ. భవిష్యత్ తరాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ప్రకటన నుంచి సచిన్ టెండూల్కర్.. వచ్చే 15 రోజుల్లో తప్పుకోకపోతే నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని బచ్చూ కాడూ హెచ్చరించాడు.
అప్పటికీ సచిన్ టెండూల్కర్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రకటన నుంచి తప్పుకోకపోతే, మహారాష్ట్రలోని ప్రతీ గణేశ్ మండపం ముందు ‘మాస్టర్’కి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతాయని అని అన్నాడు.
‘ఇలాంటి ఆన్‌లైన్ గేమింగ్ యాడ్స్ ద్వారా సచిన్ టెండూల్కర్ రూ.300 కోట్లు సంపాదించుకోవాలని అనుకుంటే, ఆయన తనకి ఇచ్చిన భారత రత్న అవార్డును తిరిగి ఇచ్చేయాలి..’ అంటూ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు డిమాండ్ చేశాడు ఎమ్మెల్యే బచ్ఛూ కాడూ..
దేశ అత్యున్నత పురష్కారం భారత రత్న అందుకున్న వ్యక్తి, ఇలాంటి నీచమైన ప్రకటనలు చేస్తే, ఆ అవార్డును వెనక్కి తీసుకోవాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకి లేఖ కూడా రాశాడు బచ్ఛూ కాడూ. ఆయన నుంచి సరైన స్పందన రాకపోవడంతో సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు తన అనుచరులతో నిరసన చేపట్టాడు.