PBKS vs RCB Qualifier 1 pitch and weather report IPL 2025: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు ముల్లన్‌పూర్‌లో తలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ వేదికపై ప్లేఆఫ్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఫైనల్‌లో అడుగుపెట్టే అరుదైన అవకాశం కోసం ఇరుజట్లు ఈ హైవోల్టేజీ పోరులో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతున్నాయి.
2014 తర్వాత తొలిసారి టాప్-2లో నిలిచిన పంజాబ్, ఈసారి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో అసాధారణ ప్రదర్శన కనబర్చింది. కోచ్ రికీ పాంటింగ్ మార్గనిర్దేశంలో జట్టు స్థిరంగా రాణిస్తోంది. ముఖ్యంగా యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య, 183 స్ట్రైక్‌రేట్‌తో 424 పరుగులు చేసి జట్టుకు కీలక విజయాలను అందించాడు. కెప్టెన్ శ్రేయస్ తన కెరీర్‌లో అత్యుత్తమ ఐపీఎల్ సీజన్‌ను (514 పరుగులు) కొనసాగిస్తూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.
ఇటీవల ముంబయి ఇండియన్స్‌పై గెలుపుతో ఊపు మీదున్న పంజాబ్.. కీలక పేసర్ మార్కో యాన్సన్ సేవలను కోల్పోనుంది. అతని స్థానంలో అజ్మతుల్లా ఓమర్జాయ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తిరిగి జట్టులోకి వస్తున్నారు.
బెంగళూరు తరఫున ఈ సీజన్ కొత్త నాయకత్వంతో కొత్త ఊపుతో బరిలోకి దిగింది. రజత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా మారింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో సత్తా చాటుతూనే ఉన్నాడు. కోహ్లీకి తోడుగా జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లు కూడా సూపర్ నాక్ లను ఆడుతున్నారు.
బౌలింగ్‌లో కూడా జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, కృనాల్ పాండ్యా వంటి అనుభవజ్ఞులు జట్టుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. లక్నోపై 228 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి వచ్చిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. జితేష్ శర్మ 85 నాటౌట్ తో ఆ మ్యాచ్‌ను ఆర్సీబీ ఖాతాలో వేసాడు.
ముల్లన్‌పూర్ మైదానం గతంలో తక్కువ స్కోర్ల మ్యాచ్‌లకు వేదికగా మారింది. 111 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ క్వాలిఫయర్ 1 కోసం కొత్త పిచ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు టాస్ గెలిచిన జట్లు ముందుగా బ్యాటింగ్ చేసి గెలిచాయి. ప్రారంభంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండగా, ఇన్నింగ్స్ రెండో అర్ధ భాగంలో పిచ్ నెమ్మదిగా మారుతుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది.
ముల్లన్‌పూర్‌లో వాతావరణం సాధారణంగానే ఉందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రతలు 30°C వరకు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
PBKS: ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, స్టోయినిస్, ఓమర్జాయ్, బ్రార్, జేమీసన్, అర్షదీప్ సింగ్.
ఇంపాక్ట్ సబ్: యుజ్వేంద్ర చహల్
RCB: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జోష్ హేజిల్ వుడ్.
ఇంపాక్ట్ సబ్: సుయాష్ శర్మ
ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. టైటిల్ ఆశలతో ఉన్న రెండు జట్లకు ఈ మ్యాచ్ లో ఓడినా మరో మ్యాచ్ తో ఫైనల్ బెర్త్ దక్కించుకునే అవకాశం ఉంటుంది.