టెస్టు క్రికెట్‌లో నయా మిస్టర్ కూల్.. కమిన్స్‌పై వీరూ ప్రశంసలు

Published : Jun 21, 2023, 04:57 PM IST
టెస్టు క్రికెట్‌లో నయా మిస్టర్ కూల్..  కమిన్స్‌పై వీరూ ప్రశంసలు

సారాంశం

Ashes 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి  పాట్ కమిన్స్ పై ప్రశంసలు వర్షం కురుస్తోంది.  ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో అతడి ఆటతీరు  అందర్నీ ఆకట్టుకుంటున్నది. 

వరల్డ్ క్రికెట్ లో టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోనిని ‘మిస్టర్ కూల్’ అంటారు.  ఎంతటి ఒత్తిడి ఉన్నా  ఏకాగ్రత కోల్పోకుండా   ప్రశాంతంగా కనిపించే ధోనిని అందరూ ‘కూల్ కెప్టెన్’అని పిలుచుకుంటార.  అయితే  ధోని తర్వాత ఇటు టీమిండియాలో గానీ మిగిలిన దేశాల్లో గానీ ఆ స్థాయి  లక్షణాలు కలిగిన సారథి రాలేదు. కానీ ఆస్ట్రేలియా  సారథి  పాట్ కమిన్స్ ‌లో మాత్రం  అలాంటి లక్షణాలు చూశానని, అతడే టెస్టు క్రికెట్ లో ఇప్పుడు ‘నయా మిస్టర్ కూల్’అని  అభివర్ణించాడు. 

యాషెస్ టెస్టు సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా  నిన్న ముగిసిన తొలి టెస్టులో  ఇంగ్లాండ్ నిర్దేశించిన 280 పరుగుల లక్ష్య ఛేదనలో 227 పరుగులకే  8 వికెట్లు కోల్పోయిన దశలో నాథన్ లియాన్ తో కలిసి కమిన్స్ చివరిదాకా  ఓపికగా బ్యాటింగ్ చేసి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

మ్యాచ్  ముగిసిన  తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్ ఖాతాలో  స్పందిస్తూ.. ‘వాట్ ఎ టెస్ట్ మ్యాచ్. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్  మ్యాచ్ ఇదే.  ఎప్పటికైనా టెస్టు క్రికెటే  బెస్ట్ క్రికెట్.  ఇంగ్లాండ్ తొలి రోజే  ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం చాలా సాహసోపేత నిర్ణయం.  కానీ ఖవాజా రెండు ఇన్నింగ్స్ లలోనూ అత్యద్భుతంగా ఆడాడు.  ఇక పాట్ కమిన్స్  టెస్టు క్రికెట్‌లో  న్యూ మిస్టర్ కూల్. అంత ఒత్తిడిలో కూడా  అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.  మరీ ముఖ్యంగా  నాథన్ లియాన్  తో కలిసి అతడు ఆడిన ఇన్నింగ్స్ చాలాకాలం గుర్తుంటుంది..’ అని   ట్వీట్ లో పేర్కొన్నాడు.  

 

ఇక ఇంగ్లాండ్ దూకుడుకు కళ్లెం వేస్తూ ఆస్ట్రేలియా  అద్భుత విజయాన్ని అందుకుంది.  ఏడాదికాలంగా ‘బజ్‌బాల్’ మంత్రంతో  విజయాల ఊపులో ఉన్న బెన్ స్టోక్స్ సేనకు వరల్డ్ ఛాంపియన్లు  ఓటమి రుచి చూపించారు.  ఎడ్జ్‌బాస్టన్ వేదికగా నిన్న ముగిసిన తొలిటెస్టులో ఆస్ట్రేలియానే 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆసీస్ సారథి పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియన్ (28 బంతుల్లో 16 నాటౌట్, 2 ఫోర్లు) లు అద్భుతంగా పోరాడారు.   8 వికెట్లు తీసి పోటీలోకి వచ్చిన ఇంగ్లాండ్.. 2 వికెట్లు తీయలేక నానా తంటాలు పడి ఓటమిని కొనితెచ్చుకుంది. 

కంగారూల విజయానికి చివర్లో 53 పరుగులు కావాలనగా.. కమిన్స్  మాత్రం  అద్భుతం చేశాడు. లియాన్ తో కలిసి  ఆసీస్‌ను విజయం వైపునకు తీసుకెళ్లాడు. పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కమిన్స్ కు లియాన్ కూడా చక్కటి సహకారం అందించాడు.   బెన్ స్టోక్స్ బౌలర్లను, తన  వ్యూహాలను మార్చి మార్చి ప్రయోగించినా ఈ  జోడీ వెరువలేదు.  మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను శిక్షిస్తూ  వడివడిగా లక్ష్యం దిశగా సాగింది.   ఇక ఆట మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనగా  రాబిన్సన్ వేసిన  93 వ ఓవర్లో కమిన్స్.. స్లిప్స్ లో ఫోర్ కొట్టి ఆసీస్ విజయాన్ని ఖాయం చేశాడు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !