
యాషెస్ సిరీస్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం ముగిసిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా సూపర్ డూపర్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆట ఆఖరి రోజు మరో నాలుగు ఓవర్లు అయితే ఆట ముగుస్తుందనగా.. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నా విజయం కోసం తుదికంటా పోరాడింది ఆస్ట్రేలియా. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టోక్స్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మొదటి రోజు 78 ఓవర్లకే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడంపై ఇంగ్లాండ్ మాజీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తొందరపాటు నిర్ణయమని వాపోతున్నారు. అన్ని వేళలా బజ్‌బాల్ పనిచేయదని.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలని సూచిస్తున్నారు.
అయితే ఈ విమర్శలపై ఎడ్జ్‌బాస్టన్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత బెన్ స్టోక్స్ స్పందించాడు. ఒక్క మ్యాచ్ లో ఓడినంత మాత్రానా తమ దృక్పథమేమీ మారదని, బజ్‌బాల్ ఆటను తాము కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. తాము ఆడిన ఆట, తీసుకున్న నిర్ణయాల కారణంగా యాషెస్ టెస్టును చూసేందుకు స్టేడియానికి వేలాది మంది తరలిరావడమే గాక ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా చూశారని తెలిపాడు.
‘మేం ఈ మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకొచ్చాం. ఇదొక అద్భుతమైన టెస్టు. మ్యాచ్ మొత్తం అభిమానులను, ప్రేక్షకులను సీట్లలో కూర్చోనీయకుండా (ఎడ్జ్ ఆఫ్ సీట్ ఫీల్) చేశాం. టెస్టు క్రికెట్ కు ఇంతకంటే కావాల్సింది ఏముంది..
మ్యాచ్‌లో ఎవరో ఒకరు గెలవాలి. తొలి టెస్టులో ఓటమి బాధించేదే. ఈ మ్యాచ్ లో మేం ఓడిపోయి ఉండొచ్చ. కానీ మేం అనుకున్న ఆటతీరు (బజ్‌బాల్)ను మాత్రం మార్చుకోం. మున్ముందు ఇదే దూకుడు కొనసాగిస్తాం. ఆస్ట్రేలియాకు కఠినమైన సవాళ్లను విసరుతాం. ఈ క్రమంలో మేం ఏ నిర్ణయం తీసుకున్నా జట్టు కోసమే..
ఫస్ట్ ఇన్నింగ్స్ లో మేం ఇన్నింగ్స్ ను త్వరగా డిక్లేర్ చేశాం. దీనిపై చాలామంది విమర్శలు చేశారు. కానీ ఆసీస్ పై ఆధిక్యం చెలాయించేందుకే అలా చేశాం. ఈ వేదికపై చివరి 20 నిమిషాల్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. మేం డిక్లేర్ చేయనంత మాత్రానా రూట్, జేమ్స్ అండర్సన్ వికెట్లు కోల్పోకుండా ఉంటారా..? అప్పుడు కూడా మేం అదే స్కోరు వద్ద ఉండేవాళ్లం కదా.. ఒకవేళ మేం ఈ మ్యాచ్ లో ముందు డిక్టేర్ చేయకుండా ఉండుంటే టెస్టు ఇంత ఎగ్జయిటింగ్ గా ఉండేదా..? మా వ్యూహానికి తగ్గట్టుగా ప్రణాళికలు అమలుచేయలేకపోయాం. రోజంతా బ్యాటింగ్ చేశాక ఏ బ్యాటర్ కూడా లాస్ట్ లో బ్యాటింగ్ చేయాలని కోరుకోడు. అందుకే మేం డిక్లేర్ ఇచ్చాం. కానీ ఆసీస్ ఓపెనర్లు ఏ పొరపాటు చేయకుండా ఆడారు...’అని చెప్పుకొచ్చాడు.