పాకిస్థాన్ సీనియర్ ప్లేయర్ అమీర్ సంచలన నిర్ణయం...రిటైర్మెంట్ ప్రకటన

By Arun Kumar PFirst Published Jul 26, 2019, 6:08 PM IST
Highlights

పాకిస్థానీ  సీనియర్ క్రికెటర్ మహ్మద్ అమీర్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ ప్రకటించాడు. 

పాకిస్థాన్ జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్న సీనియర్ ప్లేయర్ మహ్మద్ అమీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కు మాత్రమే ఇకపై తన సమయం మొత్తాన్ని కేటాయించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ వెల్లడించాడు. 

''వచ్చే ఏడాది  2020లో టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇప్పటినుండే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నాను. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకుంటే ఆ సమయాన్ని కూడా వన్డేలు, టీ20లకు కేటాయించవచ్చు. ఇలా పాకిస్థాన్ టీం ను ఈ విభాగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి ప్రతి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి వుంది. టెస్ట్ ల నుండి తప్పుకున్నా పరిమిత ఓవర్ల క్రికెట్ నుండి ఇప్పుడప్పుడే తప్పుకునే ఉద్దేశ్యం లేదు. అయితే ప్రస్తుతానికయితే ఐసిసి టీ20  
ప్రపంచ కపే లక్ష్యం.''  అని అమీర్ పేర్కొన్నాడు. 

ఇప్పటికే టీ20 ర్యాకింగ్స్ లో పాక్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే వన్డేలు, టెస్టుల్లో మాత్రం ఆ జట్టు ప్రదర్శన మరీ అద్వాన్నంగా వుంది. పాక్ ఆటగాళ్లు ఎప్పెడెలా ఆడతారో చెప్పడం కష్టం. ఒక్కోసారి అద్భుతంగా ఆడతారు...ఆ తర్వాతి మ్యాచ్ లోనే అంతకంటే పేలవ ప్రదర్శన చేస్తారు. ఇలా నిలకడలేమి ఆటతీరుతో ఆ జట్టు సతమవుతోంది. కానీ టీ20 లో మాత్రమే ఆ జట్టు కాస్త నిలకడగా ఆడుతోంది. అలాంటిది అమీర్ మిగతా విభాగాలపై దృష్టి సారించకుండా అదే టీ20 విభాగం కోసం టెస్టులకు గుడ్ బై చెప్పడం అభిమానులనే కాదు క్రికెట్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

ఇక అమీర్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 2009 లో అతడు గాలేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుండి ఇప్పటివరకు అతడు 36 టెస్టులాడి 119 వికెట్లు పడగొట్టాడు. నాలుగు మ్యాచుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. మధ్యలో  స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అతడు ఐదేళ్ల నిషేధాన్ని ఎదుర్కోవాల్సి రావడం అతడి కెరీర్ ను బాగా దెబ్బతీసింది.  

click me!