ప్రమాదకర కాశ్మీర్ లోయలో ధోని విధులు...సెక్యూరిటీపై క్లారిటీ ఇచ్చిన ఆర్మీ చీఫ్

By Arun Kumar PFirst Published Jul 26, 2019, 4:05 PM IST
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యంత ప్రమాదకరమైన కాశ్మీర్ లోయలో ఆర్మీ విధులు చేపట్టనున్న విషయం  తెలిసిందే. అయితే ఆయన రక్షణ విషయంలో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అతడి సెక్యూరిటీపై క్లారిటీ ఇచ్చారు.  

మహేంద్ర సింగ్ ధోని... ప్రపంచ  కప్ తర్వాత అత్యధికంగా వార్తల్లో నిలుస్తున్న టీమిండియా సీనియర్ ప్లేయర్. ఇన్నాళ్లు అతడి రిటైర్మెంట్ పై తీవ్ర చర్చ జరగ్గా ఇప్పుడు ధోని ఆర్మీ విధులపై తీవ్ర చర్చ జరుగుతోంది. అతడు తన కెంతో ఇష్టమైన క్రికెట్ ను ( టీమిండియా వెస్టిండిస్ టూర్) పక్కనపెట్టి ఇండియన్ ఆర్మీ ద్వారా దేశ రక్షణలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు సిద్దమయ్యాడు. దీంతో  అతడి దేశ భక్తిని ప్రశంసిస్తూ యావత్ భారతదేశంలో ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. 

అయితే గతంలోనే భారత ఆర్మీ ధోనికి ఫారాచూట్ రెజిమెంట్ లో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించింది. అయితే ఇన్నాళ్లు క్రికెట్ తో బిజీబిజీగా గడిపిన ధోని కొంతకాలం ఆర్మీలోని తన పదవికి న్యాయం చేయాలనుకుని భావించాడు. ఇదే విషయాన్ని  అతడు ఉన్నతాధికారులకు తెలుపగా... కాశ్మీర్ లోయలో జూలై 31 నుండి ఆగస్ట్ 15 వరకు  విక్టర్ ఫోర్స్ లో కలిసి పనిచేసే అవకాశాన్ని కల్పించారు. అక్కడ అతడు సాధారణ జవాన్ మాదిరిగానే పెట్రోలింగ్, గార్డ్ డ్యూటీని చేపట్టాల్సి వుంటుంది. 

అయితే ఇలా ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా వుండి...నిత్యం అల్లకల్లోగంగా వుండే కాశ్మీర్ లో ధోనికి విధులు కేటాయించడం పట్ల అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ధోనికి ప్రత్యేకంగా సెక్యూరిటీ ఏమైనా కల్పిస్తున్నారా...? ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నారా...? తదితర విషయాలను తెలుసుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయాలన్నింటిపై భారత ఆర్మీ చీఫ్  జనరల్ బిపిన్ రావత్ క్లారిటీ ఇచ్చారు. 

ఆర్మీ చీఫ్ ఏమన్నాండంటే

'' ప్రతి భారత పౌరుడి మాదిరిగానే ఒక్కసారైనా మిలిటరీ దుస్తుల్లో దేశానికి సేవచేయాలని ధోని భావించాడు. ఆ అవకాశం అతడికి వచ్చింది. ఇలా అతడు దేశ రక్షణలో పాల్గొంటూ కొన్ని కోట్ల మంది భారతీయులకు రక్షణ కల్పిస్తున్నాడు. అలాంటి వీర జవాన్ కు ప్రత్యేక భద్రత కల్పించాల్సిన అవసరం లేదు. దేశాన్ని కాపాడాలనుకునే అతడికి తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసు. కాబట్టి అతడి యూనిట్ లో పనిచేసే వారందరికి  కల్పించే సదుపాయాలు, సెక్యూరిటీని మాత్రమే కల్పిస్తాం. '' అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. 

క్రికెట్ అంటే ఇష్టపడేవారంతా తనను అభిమానిస్తుంటే ధోని మాత్రం దేశ రక్షణ కోసం పాటుపడే ఆర్మీ జవాన్లను అభిమానిస్తుంటాడు. ఈ క్రమంలోనే అతడికి  భారత ఆర్మీతో కలిసి పనిచేయాలన్న కుతూహలం పెరిగింది. ధోని ఉత్సాహాన్ని గమనించిన ఆర్మీ ఉన్నతాధికారులు అతడికి స్పోర్ట్స్ కోటాలో లెప్టినెంట్ కల్నల్ హోదాను కల్పించారు.  ఇలా బెంగళూరు హెడ్ క్వార్టర్ గా పనిచేసే పారాచూట్ రెజిమెంట్ లో చేరిన ధోని 2015 నుండి ఇప్పటివరకు  ఐదుసార్లు పారాచూట్ జంపింగ్ లో  పాల్గొన్నాడు. ఇలా ఆగ్రా ట్రెయినింగ్ క్యాంప్ లో ఆర్మీ విమానం పై నుండి దూకి ధోని అధికారికంగా పారాట్రూపర్ గా మారాడు. 
 

click me!