
దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. ఆట రెండో సెషన్ లోనే కెఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు నాలుగు కీలక వికెట్లు పోయి కష్టాల్లో పడింది. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారా లు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. పుజారా 3 పరుగులకే వెనుదిరగగా.. రహానే డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లి గైర్హాజరీలో అతడి స్థానాన్ని భర్తీ చేస్తున్న హనుమా విహారి కూడా ఆకట్టుకోలేదు.
టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లికి వెన్ను నొప్పి గాయం కారణంగా ఈ టెస్టు నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దీంతో కెఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన అతడు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (26) తో కలిసి కెఎల్ రాహుల్ (50 బ్యాటింగ్) భారత్ కు మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 36 పరుగులు జోడించారు.
5 ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన మయాంక్ అగర్వాల్.. ఇన్నింగ్స్ 14.1 ఓవర్లో జాన్సేస్ వేసిన బంతికి వెరెన్నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నయావాల్ పుజారా.. 33 బంతులాడి 3 పరుగులే చేశాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి ఇబ్బందిపడ్డ పుజారా.. ఒలివర్ బౌలింగ్ లో బవుమా కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పుజారా నిష్క్రమణ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రహానే కూడా అతడినే అనుసరించాడు. తాను ఎదుర్కున్న తొలి బంతికే.. పీటర్సన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 23 ఓవర్లకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 49 పరుగులు చేసింది.
కాగా, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల నిష్క్రమణపై ట్విట్టర్ లో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ఇద్దరూ క్రికెట్ కు వీడ్కోలు చెబితే బెటరని సూచిస్తున్నారు.
లంచ్ కు ముందే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్.. హనుమా విహారితో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కుదురుకున్నట్టే కనిపించిన విహారి.. 53 బంతుల్లో 20 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో డసెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 38.4 ఓవర్ల వద్ద భారత జట్టు నాలుగో వికెట్ ను కోల్పోయింది.
ఇక వికెట్ కీపర్ రిషభ్ పంత్ (12 బంతుల్లో 10 నాటౌట్) కలిసి రాహుల్ భారత స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. 43 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. రాహుల్ 50 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా ఉన్నాడు.