
శ్రీలంక వేదికగా ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి వన్డేలో బౌలర్లు చెలరేగిపోవడంతో 59 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘాన్, రెండో వన్డేలో 300 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది.. 301 పరుగుల లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ ఐదో బంతికి ఆఖరి వికెట్‌ని కాపాడుకుంటూ గెలిచి ఊపిరి పీల్చుకుంది పాకిస్తాన్..
తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 300 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్ఘాన్ ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జడ్రాన్ కలిసి తొలి వికెట్‌కి 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. 101 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన ఇబ్రహీం జడ్రాన్, ఒసామా మిర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మహ్మద్ నబీ 29 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
రషీద్ ఖాన్ 2 పరుగులు చేసి షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ కాగా షాహీదుల్లా 1 పరుగుకే రనౌట్ అయ్యాడు. 151 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 151 పరుగులు చేసిన ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ 11 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు, అబ్దుల్ రహ్మాన్ 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు..
301 పరుగుల లక్ష్యఛేదనలో ఫకార్ జమాన్ 34 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసి ఫజల్‌హక్ ఫరూకీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అయితే ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ కలిసి రెండో వికెట్‌కి 118 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 66 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఫజల్‌హక్ ఫరూకీ బౌలిం్గలోనే అవుట్ అయ్యాడు.
ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 105 బంతుల్లో 4 ఫోర్లతో 91 పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. మహ్మద్ రిజ్వాన్ 2 పరుగులు చేసి రనౌట్ కాగా అఘా సల్మాన్ 14, ఇఫ్తికర్ అహ్మద్ 17, షాహీన్ ఆఫ్రిదీ 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒసామా మిర్ డకౌట్ అయ్యాడు. షాహీన్ ఆఫ్రిదీ అవుట్ అయ్యే సమయానికి పాకిస్తాన్ విజయానికి 14 బంతుల్లో 27 పరుగులు కావాలి.
అబ్దుల్ రెహ్మాన్ వేసిన 49వ ఓవర్‌లో 2, 2, 2, 4, 6 బాదిన షాదబ్ ఖాన్ 16 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో పాక్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో మొదటి బంతి వేయడానికి ముందే షాదబ్ ఖాన్ క్రీజు దాటడం, బౌలర్ ఫజల్‌హక్ ఫరూకీ మన్కడింగ్ రనౌట్ చేయడం జరిగిపోయాయి. 35 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసిన షాదబ్ ఖాన్ అవుట్ కావడంతో ఆఫ్ఘాన్ ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా.
అయితే ఆఖరి ఓవర్ మొదటి బంతికి ఫోర్ బాదిన నసీం షా, ఆ తర్వాత మూడో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి హారీస్ రౌఫ్ ఏకంగా 3 పరుగులు రాబట్టాడు. దీంతో చివరి 2 బంతుల్లో పాక్ విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి ఫోర్ బాదిన నసీం షా... పాకిస్తాన్‌కి థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. పాకిస్తాన్‌పై మొదటి వన్డే విజయం అందుకునే అద్భుత అవకాశం దక్కినా, ఆఖరి వికెట్ తీయలేక దాన్ని చేజార్చుకుంది ఆఫ్ఘాన్..