
రెండు దశాబ్దాల అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా కు తొలి టెస్టులో మొదటి రోజు అనుకున్నంతగా లాభించలేదు. తొలి రోజు ఆ జట్టు ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగింది. ఉపఖండపు పిచ్ లపై రెచ్చిపోయే ఆడే పాకిస్థాన్.. మరోసారి తన బ్యాటింగ్ సత్తాను రుచి చూపించింది. ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగా.. పెషావర్ లో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి 30 మందిని పొట్టనబెట్టుకున్నారన్న వార్తలు ఆటగాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నా వెరవకుండా.. పాకిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేశాడు. రోజంతా బ్యాటింగ్ చేసిన అతడు.. 132 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడికి అజర్ అలీ కూడా తోడయ్యాడు. అభిమానులకు అసలైన టెస్ట్ క్రికెట్ మజాను పంచుతూ బ్యాట్.. బాల్ మధ్య సమరం ఇరు జట్ల ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నది.
1998 తర్వాత పాకిస్థాన్ లో రావల్పిండి వేదికగా తొలి టెస్టు ఆడుతున్న ఆసీస్ కు ఈ మ్యాచులో టాస్ కలిసిరాలేదు. పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతడి నమ్మకాన్ని ఓపెనర్లు వమ్ము చేయలేదు.
ఓపెనర్లు అబ్దుల్లా షషిక్ (44), ఇమామ్ ఉల్ హక్ లు ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 105 బంతులు ఎదుర్కున్న అబ్దుల్లా.. 44 పరుగులు చేసి లంచ్ కు ముందు స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో ఆసీస్ సారథి పాట్ కమిన్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అబ్దుల్లా నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన అజర్ అలీ (64*) తో జతకలిసిన ఇమామ్.. ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దుర్భేధ్యమైన డిఫెన్స్ తో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో రెండో సెషన్ ముగుస్తుందనగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి ఇదే తొలి సెంచరీ.
శతకం తర్వాత కూడా ఇమామ్ నిలకడ ప్రదర్శించాడు. అజర్ తో కలిసి భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. ఈ జంటను విడదీయడానికి కమిన్స్.. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ జట్టులో పేసర్లు మిచెల్ స్టార్క్, హెజిల్వుడ్, కమిన్స్ తో పాటు.. స్పిన్నర్ నాథన్ లియాన్ లకు తోడు ట్రావిస్ హెడ్, కామరూన్ గ్రీన్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ లు బౌలింగ్ చేసినా అజర్-ఇమామ్ ల జంటను విడదీయలేకపోయారు. రెండో వికెట్ కు ఈ ఇద్దరూ కలిసి 140 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరి ఆటతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్.. 90 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి 245 పరగులు చేసింది. ఆసీస్ 8 మంది బౌలర్లను ఉపయోగించినా.. లియాన్ కు మాత్రమే వికెట్ దక్కింది.