
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సెలెక్షన్ కమిటీ మీటింగులకు హాజరువుతున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సెలక్షన్ కమిటీ సభ్యులు. నిబంధనలను విరుద్ధంగా అతడు.. తన హోదాను అడ్డు పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడని గత కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ఓ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే అప్పట్లో గంగూలీ దీనిపై వివరణ ఇవ్వడంతో కాస్త చల్లబడిన ఈ అంశంపై ముగ్గురు మాజీ సెలెక్టర్లు మళ్లీ సంచలన ఆరోపణలు చేసి నిప్పు రగిలించారు. గంగూలీ చెప్పినవన్నీ అబద్ధాలేనని అతడు బీసీసీఐ బాస్ గా అయినప్పట్నుంచే సెలెక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నాడని చెప్పారు.
ఈ మేరకు ఇండియన్ ఎక్స్ఫ్రెస్ లో వచ్చిన ఓ కథనం మేరకు సెలక్షన్ కమిటీలోని ముగ్గురు సభ్యులు స్పందిస్తూ... ‘మేము ఆన్లైన్ లో నిర్వహించే సమావేశాలకు గంగూలీ హాజరవుతున్నాడు. అతడు బీసీసీఐ చీఫ్ హోదాలో ఉండటం వల్ల మేము అతడికి ఎదురుచెప్పలేకపోతున్నాం...
గంగూలీ సెలెక్షన్ కమిటీ సమావేశాలకు రావడం మాలో కొంతమందికి ఇబ్బందిగా ఉంది. కానీ మేం అతడిని ఏమనగలం..? ఏమన్నా అందామంటే అతడు బీసీసీఐ అధ్యక్షుడాయె...’ అని అన్నారు.
అంతేగాక.. ‘మీ బాస్ మీద మీరు ఫిర్యాదు చేస్తారా..? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అన్నీ తెలిసి అతడు సెలెక్షన్ సమావేశాలలో జోక్యం చేసుకుంటున్నాడు. ఇంతకంటే మేమేమీ చెప్పలేం..’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో జోక్యం చేసుకునేందుకు వీల్లేదు. కానీ బీసీసీఐ సెక్రెటరీకి మాత్రం ఆ అవకాశముంది. జట్టును ఎంపిక చేసే తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే. సెలెక్షన్ కమిటీ.. కెప్టెన్, కోచ్ లతో మాట్లాడి జట్టును ఎంపిక చేస్తుంది. కానీ గంగూలీ మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి సెలక్షన్ కమిటీ సమావేశాలకు హాజరవుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గంగూలీ ఏమన్నాడు..?
అయితే తనపై వచ్చిన ఆరోపణలపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ‘ఈ విషయం (గంగూలీ సెలెక్షన్ కమిటీలో తలదూర్చడం గురించి) లో నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని. బీసీసీఐ ప్రెసిడెంట్ ఏం చేయాలో నేనూ అదే చేస్తున్నా. ఈ ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ చిత్రా (గంగూలీ, జైషా, విరాట్ కోహ్లి, జాయింట్ సెక్రెటరీ జయేష్ జార్జ్ తో కూడిన ఫోటో)న్ని నేను కూడా చూశాను. అది సెలెక్షన్ కమిటీ లో నేను జాయిన్ అయిన మీటింగ్ గా ప్రచారం జరుగుతున్నది. ఆ ఫోటో అందుకు సంబంధించింది కాదు. జయేష్ జార్జ్ సెలెక్షన్ కమిటీ సమావేశాల్లో భాగం కాదు. నేను భారత్ తరఫున 424 మ్యాచులు ఆడిన వ్యక్తిని. నిబంధనలు నాకు తెలియవా..? అవి తెలియకుండానే ఇక్కడ కూర్చున్నానా..?’ అని ప్రశ్నించాడు.