సిరీస్ కు ఒక సారథి.. బీసీసీఐ తీరుతో నలిగిపోతున్న టీమిండియా హెడ్ కోచ్.. కక్కలేక మింగలేక..!

Published : Jul 06, 2022, 06:49 PM IST
సిరీస్ కు ఒక సారథి.. బీసీసీఐ తీరుతో నలిగిపోతున్న టీమిండియా హెడ్ కోచ్.. కక్కలేక మింగలేక..!

సారాంశం

Team India Captains: టీమిండియాకు  విరాట్ కోహ్లి ఏ క్షణాన రాజీనామా చేశాడో..  ఆ సమయంలో అతడు బీసీసీఐ సెలక్టర్లకు ఏం శాపం పెట్టాడో గానీ అతడు వైదొలిగినప్పట్నుంచి  భారత జట్టుకు సిరీస్ కు ఓ కెప్టెన్ మారుతున్నాడు. 

ఒక వ్యక్తిగా ఒక పని చేసేదానికంటే బృందంగా  చేసే పనుల్లో ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఆ బృందాన్ని  నడిపించేవాడితో పాటు దానికి మార్గదర్శకంగా ఉండే వ్యక్తి చాలా కీలకం. ఆ ఇద్దరి మధ్య సమన్వయ లోపం తలెత్తితే దాని ప్రభావం మొత్తం గ్రూప్ మీద పడుతుంది. ఇదే సూత్రాన్ని క్రికెట్ లో అన్వయించుకుంటే  జట్టును నడిపించే నాయకుడితో పాటు టీమ్ మొత్తానికి మార్గదర్శనంగా ఉంటే హెడ్ కోచ్ కీలకం. వీళ్లిద్దరి మధ్య  సమన్వయం సరిగ్గా ఉంటేనే ఆ జట్టు విజయవంతమవుతంది. కానీ బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరును చూస్తే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఈ సూత్రం  బొత్తిగా సూటయ్యేలా లేదు. 

ఎందుకంటే అతడు హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నాక గడిచిన 8 నెలల్లో ద్రావిడ్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లతో పనిచేశాడు. బహుశా గతంలో టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న ఏ వ్యక్తి కూడా ఇంతమంది కెప్టెన్లతో పని చేసుండడు.  

ద్రావిడ్ కోచింగ్ లో కెప్టెన్లు..

గతేడాది టీ20  ప్రపంచకప్ ముగిసి  ఇంటికి చేరాక టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు ద్రావిడ్ (నవంబర్ లో).  అదే  సమయంలో రోహిత్ శర్మ కూడా కోహ్లి నుంచి బాధ్యతలు తీసుకుని కెప్టెన్ అయ్యాడు. నవంబర్ లో ఇండియా-న్యూజిలాండ్ తో మూడు టీ20 లకు ఇద్దరూ కలిసి పనిచేశారు.  తర్వాత రెండు టెస్టులకు  రోహిత్ కు (ఇంకా అప్పటికీ అతడికి  టెస్టులకు సారథిగా చేయలేదు) విశ్రాంతి. కాన్పూర్ టెస్టులో అజింక్యా రహానే, ముంబై టెస్టులో విరాట్ కోహ్లిలు సారథులు. నెల తిరిగేలోపే ముగ్గురు సారథులు. 

ఈ సిరీస్ తర్వాత భారత జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అక్కడ తొలి టెస్టుకు కోహ్లి కెప్టెన్ కాగా.. రెండో టెస్టుకు కెఎల్ రాహుల్. తిరిగి మూడో టెస్టుకు కోహ్లి. ఇక్కడ సిరీస్ ను 1-2తో ఓడటంతో కోహ్లి టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. టెస్టు సిరీస్ ముగిశాక వన్డే సిరీస్ కు (అప్పటికే రోహిత్ ను వన్డే కెప్టెన్ గా ప్రకటించినా అతడు గాయం కారణంగా ఆ పర్యటనకు వెళ్లలేదు) కెఎల్ రాహుల్ సారథిగా ఉన్నాడు. అనంతరం భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు.. శ్రీలంకతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడింది. ఈ సిరీస్ లకు రోహితే కెప్టెన్.  

 

ఇక ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ లో రోహిత్ కు రెస్ట్, కెఎల్ రాహుల్ కు గాయం కావడంతో రిషభ్ పంత్ సారథిగా అయ్యాడు. ఆ వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ రోహిత్ కరోనా కారణంగా ఎడ్జబాస్టన్ టెస్టు ఆడకపోవడంతో జస్ప్రీత్ బుమ్రా  కెప్టెన్ అయ్యాడు (ఈ గ్యాప్ లో  భారత జట్టు ఐర్లాండ్ తో రెండు టీ20లు ఆడి హార్ధిక్ పాండ్యా సారథిగా, వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్ గా సిరీస్ నెగ్గింది). ఇక ఇంగ్లాండ్ తో జులై 7 నుంచి జరుగబోయే టీ20, వన్డే సిరీస్ కు మళ్లీ రోహిత్ కెప్టెన్ గా  రానున్నాడు. 

మరో సిరీస్.. మరో కెప్టెన్.. 

ఇదిలాఉండగా.. ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిశాక  భారత జట్టు యూకే నుంచే నేరుగా కరేబియన్ దీవుల్లో వాలనున్నది. ఈ సిరీస్ కు సెలక్టర్లు రోహిత్ శర్మ కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు.  

ద్రావిడ్ కోచింగ్ లో వచ్చిన సారథుల సంఖ్య 8.. జాబితా ఇది : రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్థిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్. 

 

ఎందుకిలా..? 

రొటేషన్ పద్దతి, గాయాలు, తీరిక లేని క్రికెట్ ఆడుతుండటం  వల్ల ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తున్నామని సెలక్టర్లు, బీసీసీఐ చెబుతున్నది. దాదాపు నలుగురైదుగురు మినహా ఫార్మాట్ ను బట్టి  ప్లేయర్లు మారుతున్నారు. వాళ్లకు సిరీస్ గ్యాప్ తోనే విశ్రాంతినివ్వడం దేనికి సంకేతమో సెలక్టర్లకే తెలియాలి.  టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఆయా బోర్డులు స్థిరమైన జట్టును నిర్మించుకునే పనిలో ఉంటే బీసీసీఐ మాత్రం ఇంకా సిరీస్ కొక కెప్టెన్ ను మార్చుకుంటూ ప్రయోగాలు చేస్తున్నది. బీసీసీఐ సంగతేమో గానీ ఇంతమంది తో పనిచేయడమనేది  రాహుల్ ద్రావిడ్ కు ఇబ్బందికరమే. ఒక్క కెప్టెన్ కు రెస్ట్ ఇస్తే మరొకరితో కలిసి నడవడానికే కోచ్ లు ఒప్పుకోరు. అలాంటిది 8 నెలల్లో సిరీస్ కు ఒక కెప్టెన్ మారుతుంటే  ద్రావిడ్ బాధను ఊహించుకోవచ్చు. ఒక ఆటగాడితో సమన్వయం ఏర్పడి వారి ప్రయాణం సాఫీగా సాగుతుంటేనే వాళ్లు అనుకున్న లక్ష్యానికి చేరతారు. కానీ ఇలా నెలకొక కెప్టెన్ మారుతుంటే ఐసీసీ టోర్నీలేమో గానీ ద్వైపాక్షిక సిరీస్ లు నెగ్గడం కూడా కష్టమే అని అభిప్రాయపడుతున్నారు టీమిండియా అభిమానులు. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు