Sachin Tendulkar: క్రికెట్ దేవుడు గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది ఈ రోజే.. ఫోటో షేర్ చేసిన బీసీసీఐ

Published : Nov 15, 2021, 03:27 PM ISTUpdated : Nov 15, 2021, 03:32 PM IST
Sachin Tendulkar: క్రికెట్ దేవుడు గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది ఈ రోజే.. ఫోటో షేర్ చేసిన బీసీసీఐ

సారాంశం

Sachin Tendulkar Debut: అప్పటివరకు పాకిస్థాన్ బౌలర్లకే కాదు.. యావత్ ప్రపంచానికి కూడా తెలియదు..! వరల్డ్ క్రికెట్ ను అతడు శాసించబోతాడని.. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లు సైతం  అతడి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారని.. భారత్ లో అతడు క్రికెట్ కు పర్యాయ పదంగా మారుతాడని..  

అది 1989, నవంబర్ 15. చిరకాల ప్రత్యర్థులు India-Pakistan మధ్య మ్యాచ్. వేదిక కరాచీ. అదీ పాకిస్థాన్ గడ్డే.  పాక్ బౌలర్లు ఇమ్రాన్ ఖాన్, స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్ బౌలింగ్ తో నిప్పులు చెరుగుతున్నారు.  భారత బ్యాట్స్మెన్ ఇబ్బందులు పడుతున్నారు.  ఆ సమయంలో క్రీజులోకి ఓ  పాలబుగ్గల పసివాడు అడుగుపెట్టాడు. అప్పటికీ ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలేదు. వయసు 16 సంవత్సరాల 205 రోజులు. భీకర బౌలింగ్ దాడి కలిగిన పాక్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచాడు.  ఆ మ్యాచ్ లో పెద్దగా రాణించకపోయినా.. తర్వాత అతడిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. అప్పటివరకు పాక్ బౌలర్లకే కాదు.. యావత్ ప్రపంచానికి కూడా తెలియదు.. ప్రపంచ క్రికెట్ ను అతడు శాసించబోతాడని.. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లు సైతం  అతడి వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారని.. భారత్ లో అతడు క్రికెట్ కు పర్యాయ పదంగా మారుతాడని.. వంద కోట్ల ప్రజలు అతడిని క్రికెట్ దేవుడిగా ఆరాధిస్తారని.. అతడి పేరే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. 

సుదీర్ఘ కాలం భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించిన లిటిల్ మాస్టర్.. క్రికెట్ లోకి అడుగుపెట్టింది  ఈ రోజే.  భారత్ లో క్రికెట్ దేవుడిగా కొలిచే Sachin Tendulkar.. టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి నేటికి 32 ఏండ్లు.  ఈ సందర్భంగా BCCI తన ట్విట్టర్ పేజీలో ఒక ట్వీట్ ఉంచింది. ‘1989న ఇదే రోజున సచిన్.. తన టీమిండియాలోకి అడుగుపెట్టాడు. 2013లో  ఈ బ్యాటింగ్ లెజెండ్ అంతర్జాతీయ  క్రికెట్ నుంచి వైదొలిగాడు.. ’ అంటూ అందులో రాసుకొచ్చింది. 

 

ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నది. సచిన్ రికార్డుల గురించి రాయడానికి పుస్తకాలు చాలవు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సచిన్ కే చెల్లింది.  వేలాది పరుగులు చేసినా.. టన్నుల కొద్ది సెంచరీలు చేసినా.. రికార్డుల రారాజుగా వెలుగొందినా.. ఎన్నో పురస్కారాలు వచ్చినా.. సచిన్ ఏనాడూ పొంగిపోలేదు. తన కెరీర్ లో గడ్డు పరిస్థితులను అధిగమించి నిలదొక్కుకున్నాడు. కింద పడ్డ ప్రతిసారీ గోడకు కొట్టిన బంతిలా  పైకి లేచాడు. 

పదో తరగతి ఫెయిల్ అయిన సచిన్.. జీవితంలో మాత్రం ఎవరెస్టు కంటే ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. వివాదాలకు దూరంగా ఉంటూ  తనను విమర్శించినవారందరికీ బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. తన కెరీర్ లో మొదటి టెస్టుతో పాటు మొదటి  వన్డే (1989, డిసెంబర్ 18) కూడా పాకిస్థాన్ మీదనే ఆడిన  సచిన్.. తన చివరి టెస్టు (2103, నవంబర్ 14) వెస్టిండీస్ మీద ఆడాడు. చివరి వన్డే ను మాత్రం పాకిస్థాన్ (2102, మార్చి 18) మీదే ఆడి ముగించాడు. 

 

సుదీర్ఘ కెరీర్ లో సచిన్.. 200 టెస్టులాడి 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలున్నాయి. 248 టాప్  స్కోర్. బ్యాటింగ్ సగటు 53.78.  ఇక వన్డేలలో 463 ఒక్క రోజు అంతర్జాతీయ మ్యాచులాడిన లిటిల్ మాస్టర్.. 18,426 పరుగులతో  ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. వన్డేలలో సచిన్ 49 సెంచరీలు.. 96 అర్థ శతకాలు సాధించాడు.  టాప్ స్కోర్ 200. (వన్డేలలో తొలి డబుల్ సెంచరీ చేసింది సచినే..)  వన్డేలలో బ్యాటింగ్ సగటు 44.83. టెస్టులు, వన్డేలు కలిపి సచిన్ అంతర్జాతీయ కెరీర్ లో 34,357 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో సచిన్.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. 

ఇదిలాఉండగా.. సచిన్ తో పాటే పాకిస్థాన్ బౌలర్ వకార్ యూనిస్ కూడా కరాచీ మ్యాచ్ లోనే కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ మ్యాచ్ లో సచిన్ ను ఔట్ చేసింది వకార్ యూనిసే కావడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

ఇదేం లాజిక్ సామీ.. గంభీర్ దత్తపుత్రుడి కోసం ఇద్దరి కెరీర్ బలి.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?
ఒరేయ్ బుడ్డోడా.. సచిన్‌ను గుర్తు చేశావ్.! 14 సిక్సర్లతో మోత మోగించిన వైభవ్.. ఏం కొట్టుడు మావ