డ్రాగా ముగిసిన కరాచీ టెస్టు... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్, కివీస్ అవుట్...

By Chinthakindhi RamuFirst Published Dec 31, 2022, 12:24 PM IST
Highlights

డ్రాగా ముగిసిన పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలి టెస్టు... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ కూడా అవుట్! ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన న్యూజిలాండ్... 

స్వదేశంలో ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో తొలి టెస్టును డ్రా చేసుకోగలిగింది. ఐదు రోజుల పాటు సాగిన వెలుతురు లేమి కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలి టెస్టు ఆడిన కేన్ విలియంసన్, దాదాపు రెండేళ్ల తర్వాత సెంచరీ సాధించి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 280 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 161 పరుగులు చేశాడు. మూడేళ్ల తర్వాత క్రికెట్ ఆడుతున్న సర్ఫరాజ్ అహ్మద్ 86 పరుగులు చేయగా అఘా సల్మాన్ 103 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 612 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ 113 పరుగులు చేయగా డివాన్ కాన్వే 92 పరుగులకి అవుట్ అయ్యాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ 395 బంతుల్లో 21 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

డార్ల్ మిచెల్ 42, టామ్ బ్లండెల్ 47 పరుగులు చేయగా ఇష్ సోదీ 65 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి 174 పరుగుల ఆధిక్యం దక్కడంతో మ్యాచ్‌పై ఆసక్తిరేగింది. అయితే కివీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వని పాక్... 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. ఇమామ్ వుల్ హక్ 96 పరుగులు చేసి అవుట్ కాగా సర్ఫరాజ్ అహ్మద్ 53, సౌద్ షకీల్ 55, మహ్మద్ వసీం జూనియర్ 43 పరుగులు చేశారు...

ఐదో రోజు దాదాపు ఓవర్లన్నీ ముగిసిన తర్వాత ఓటమి నుంచి తప్పించుకున్నామనే ధీమా వచ్చిన తర్వాతే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది పాకిస్తాన్.  137 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన న్యూజిలాండ్ 7.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 61 పరుగులు చేసింది. బ్రాస్‌వెల్ 3 పరుగులకే అవుట్ అయినా డివాన్ కాన్వే 16 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు, టామ్ లాథమ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ విజయానికి 76 పరుగులే కావాల్సిన సమయంలో వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్‌ని నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాకిస్తాన్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌ని ఆరంభించిన న్యూజిలాండ్, ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకోవడం విశేషం. 

click me!