అంపైర్‌ని కొట్టిన పాక్ క్రికెటర్! కోపంతో పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అలీం దార్... కాళ్లు పట్టుకుని...

By Chinthakindhi RamuFirst Published Jan 12, 2023, 11:40 AM IST
Highlights

రెండో వన్డేలో 79 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాకిస్తాన్... వన్డే సిరీస్‌ని 1-1 సమం చేసిన న్యూజిలాండ్... మహ్మద్ వసీం త్రో దెబ్బకు అంపైర్ అలీం దార్‌కి గాయం.. 

ఇంగ్లాండ్ చేతుల్లో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్ అయిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ విజయాన్ని అందుకోలేకపోయింద. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో స్వదేశంలో ఒక్క టెస్టు కూడా గెలవలేకపోయింది పాకిస్తాన్...

తొలి వన్డేలో భారీ విజయం అందుకున్న పాకిస్తాన్‌కి రెండో వన్డేలో షాక్ తగిలింది. కరాచీలో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 261 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 

డివాన్ కాన్వే 92 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 101 పరుగులు చేయగా కెప్టెన్ కేన్ విలియంసన్ 100 బంతుల్లో 10 ఫోర్లతో 85 పరుగులు చేశాడు. 183 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్, 79 పరుగుల తేడాతో ఆలౌట్ అవ్వడం విశేషం..

డార్ల్ మిచెల్ 5, టామ్ లాథమ్ 2, గ్లెన్ ఫిలిప్స్ 3, బ్రాస్‌వెల్ 8, ఇష్ సోదీ 7, టిమ్ సౌథీ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు. మిచెల్ సాంట్నర్ 40 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో కివీస్ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది...

Ouch 😬🙏 | pic.twitter.com/JyuZ0Jwxi5

— Pakistan Cricket (@TheRealPCB)

262 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్, 43 ఓవర్లలో 182 పరుగులకి ఆలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 114 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 79 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 50 బంతుల్లో 2 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఫకార్ జమాన్ డకౌట్ కాగా ఇమామ్ వుల్ హక్ 6 పరుగులు చేశాడు. వైస్ కెప్టెన్ షాన్ మసూద్ ఈ మ్యాచులో కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. 

అయితే ఈ సమయంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 36వ ఓవర్‌లో గ్లెన్ ఫిలిప్స్ కొట్టిన బంతిని ఆపిన మహ్మద్ వసీం జూనియర్, నేరుగా వికెట్లను గురి చేసి విసిరాడు... అయితే అది నేరుగా వెళ్లి అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది...

బంతి దెబ్బకు అలీం దార్‌కి కోపం చిర్రెత్తుకురావడంతో తన చేతిలో ఉన్న పాక్ జెర్సీలను నేలకేసి కొట్టాడు. ఈ సంఘటన తర్వాత మహ్మద్ వసీం జూనియర్, అంపైర్ దగ్గరికి వెళ్లి.. కాళ్లు పట్టుకుని దెబ్బ తగిలిన చోట రుద్దుతూ సేవలు చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్తాక్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

click me!