భారత్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. నలుగురు స్పిన్నర్లతో రానున్న కంగారులు..

By Srinivas MFirst Published Jan 11, 2023, 11:28 AM IST
Highlights

INDvsAUS: వచ్చే నెలలో  భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ కోసం  క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 

ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో  భాగంగా  వచ్చే నెలలో భారత  పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా.. ఈ సిరీస్ లో పాల్గొనబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది.  ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా.. 18 మందితో కూడిన జట్టును ట్విటర్ లో  పేర్కొంది.   ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ (డబ్ల్యూటీసీ) ఫైనల్  బెర్త్ ను ఖాయం చేసుకున్న ఆసీస్.. భారత్  ను స్వదేశంలో ఓడించాలనే పట్టుదలతో ఉంది.  జట్టు ఎంపిక కూడా అందుకు అనుగుణంగానే ఉంది. ఉపఖండపు పిచ్ లు స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటాయని తెలిసిన ఆసీస్.. ఈ సిరీస్ కోసం ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం గమనార్హం. 

ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని   ఈ జట్టులో  ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియాన్ తో పాటు  మిచెల్ స్వెప్సన్,  ఆస్టన్ అగర్  లే గాక  యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీని కూడా జట్టులో చేర్చింది.   మర్ఫీ..  విక్టోరియా  తరఫున ఆడుతూ దేశవాళీలో నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు.   

ఫిబ్రవరి 9 నుంచి మార్చి 13 వరకు ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టులు జరగాల్సి ఉన్నాయి. అయితే  నాగ్‌పూర్ వేదికగా జరిగే తొలి టెస్టుకు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అందుబాటులో ఉండడు.  చేతి వేలి గాయం కారణంగా అతడు రెండో టెస్టు నుంచి  జట్టుతో కలుస్తాడు.  వేలి గాయంతో బాధపడుతున్న మరో ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను జట్టులోకి ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. అతడు బ్యాటింగ్ కే పరిమితమైతాడా..? లేక బౌలింగ్ కూడా చేస్తాడా..? అన్నది  స్పష్టం చేయలేదు. 

ఇక బ్యాటింగ్  విషయానికొస్తే  డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా,  ట్రావిస్ హెడ్, కామోరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్కాంబ్ లతో పాటు అలెక్స్ క్యారీ,  మాథ్యూ రెన్షా కూడా బ్యాటింగ్ చేయగలరు.  బౌలింగ్ విషయానికొస్తే.. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జోష్ హెజిల్వుడ్,  మిచెల్ స్టార్క్,  స్కాట్ బొలాండ్ లు పేసర్లుగా ఉన్నారు. స్పిన్నర్లుగా లియాన్, మర్ఫీ, అగర్, స్వెప్సన్ లు ఉన్నారు.  బలమైన జట్టుతోనే ఆసీస్.. భారత్ తో తలపడనుంది. 

భారత్ తో సిరీస్ కు ఆస్ట్రేలియా జట్టు :  ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, ఆస్టన్ అగర్, స్కాట్ బొలాండ్, అలెక్స్ క్యారీ,  కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్కాంబ్, జోష్ హెజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, డేవిడ్ వార్నర్ 

 

An 18-player Test squad has been assembled for the Qantas Tour of India in February and March.

Congratulations to everyone selected! pic.twitter.com/3fmCci4d9b

— Cricket Australia (@CricketAus)

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ షెడ్యూల్ : 

- తొలి టెస్టు :  ఫిబ్రవరి 9-13 - నాగ్‌పూర్
- రెండో టెస్టు : ఫిబ్రవరి 17-21 - ఢిల్లీ 
- మూడో టెస్టు :  మార్చి 1-5 - ధర్మశాల 
- నాలుగో టెస్టు : మార్చి 9-13  - అహ్మదాబాద్ 

click me!