వాన్ బీక్ సంచలనం.. తెలుగు కుర్రాడి వీరవిహారం.. నెదర్లాండ్స్ ‘సూపర్’ విక్టరీ.. విండీస్ కథ కంచికేనా..?

Published : Jun 27, 2023, 09:31 AM IST
వాన్ బీక్ సంచలనం.. తెలుగు కుర్రాడి వీరవిహారం.. నెదర్లాండ్స్ ‘సూపర్’ విక్టరీ.. విండీస్ కథ కంచికేనా..?

సారాంశం

ICC World Cup 2023 Qualifiers: వన్డే వరల్డ్ కప్ కు ముందు  జింబాబ్వే వేదికగా జరుగుతున్న  క్వాలిఫై రౌండ్ లో పెను సంచలనాలు నమోదయ్యాయి. వెస్టిండీస్ - నెదర్లాండ్స్ మ్యాచ్  లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. 

రెండుసార్లు వన్డే వరల్డ్ కప్, రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టు వెస్టిండీస్‌‌కు పసికూన నెదర్లాండ్స్ ఊహించని షాకిచ్చింది.  ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ కు ముందు జింబాబ్వేలో ఐసీసీ నిర్వహిస్తున్న  క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో  నెదర్లాండ్స్  జట్టు.. విండీస్ ను చావుదెబ్బ కొట్టింది. విండీస్ భారీ స్కోరు చేసినా  ఆఖరి వరకూ  నిలిచి మ్యాచ్ ను డ్రా చేసుకోవడమే కాకుండా  సూపర్ ఓవర్ ద్వారా తేలిన ఫలితంలో  సూపర్ డూపర్ విక్టరీతో  సూపర్ సిక్సెస్ లో ప్రవేశించింది.  నెదర్లాండ్స్ టీమ్ లో  ఆంధ్రాకు చెందిన తేజ  సంచలన ఇన్నింగ్స్ తో  దుమ్మురేపాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్..  విండీస్ కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే అంతగా అనుభవం లేని   డచ్ బౌలర్లను విండీస్ ఓపెనర్లు ఆటాడుకున్నారు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (76), చార్లెస్ (54) వీరబాదుడు బాదారు.  ఓపెనర్లు తొలి వికెట్ కు 101 పరుగులు జోడించారు. 

ఆ తర్వాత విండీస్ విధ్వంసక వీరుడు  నికోలస్ పూరన్.. 65 బంతుల్లోనే 9 బౌండరీలు, 6 సిక్సర్ల సాయంతో  104 రన్స్ చేశాడు.  చివర్లో కీమో పాల్ కూడా 25 బంతుల్లోనే  4 ఫోర్లు, 2 సిక్సర్లతో రెచ్చిపోవడంతో   కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 374 పరుగులు చేసింది. 

ఆంధ్రా కుర్రాడు అదుర్స్.. 

భారీ లక్ష్య ఛేదనలో డచ్ టీమ్ ఎక్కడా వెనుకడుగు వేయలేదు.  భారత్ కు చెందిన పలువురు క్రికెటర్లు ఇక్కడ అవకాశాలు లేక డచ్ టీమ్ లో ఆడుతున్న విషయం తెలిసిందే. వీళ్లు  నిన్న మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్  విక్రమ్‌జీత్ సింగ్ (32 బంతుల్లో 37, 5 ఫోర్లు) ధాటిగా ఆడగా మరో ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ (36) కూడా రాణించాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు  చెందిన తేజ నిడమనూరు.. సంచలన ఇన్నింగ్స్ తో డచ్ టీమ్ కు విజయం మీద ఆశలు కల్పించాడు. 76 బంతులాడిన తేజ..  11 బౌండరీలు, 3 భారీ సిక్సర్ల సాయంతో  111 పరుగులు సాధించాడు.  అతడికి తోడుగా  నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (47 బంతుల్లో 67, 6 ఫోర్లు, 1 సిక్సర్) కూడా ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరికీ తోడు చివర్లో 9వ నెంబర్ బ్యాటర్ లొగన్ వాన్ బీక్.. 14 బంతుల్లోనే 3 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో  28 పరుగులు చేశాడు.  చివరి ఓవర్లో 9 పరుగులు అవసరముండగా నెదర్లాండ్స్ 8 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. 

 

సూపర్ ఓవర్‌లో పీక్స్.. 

మ్యాచ్ టై అవడంతో ఫలితం తేలడానికి  సూపర్ ఓవర్  అవసరం పడింది. డచ్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది.  ఆ జట్టు  ఊపు మీదున్న వాన్ బీక్ నే బ్యాటింగ్ కు పంపింది. టీమ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వాన్ బీక్ నిలబెట్టాడు. జేసన్ హోల్డర్ వేసిన ఓవర్ లో 4,6,4,6,6,4  తో  ఏకంగా 30 పరుగులు రాబట్టాడు.  ఆ తర్వాత  అతడే బౌలింగ్ కూడా వేసి విండీస్ ను 8 పరుగులకే కట్టడి చేయడమే కాకుండా రెండు వికెట్లు కూడా తీసి  తన కెరీర్ లో మరిచిపోలేని చిరస్మరణీయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 

ఈ ఓటమితో విండీస్ వరల్డ్ కప్  క్వాలిఫై ఆశలు దాదాపు అడుగంటినట్టే..  ఆ  జట్టు సూపర్ సిక్సెస్ కు చేరినా టాప్ - 2 లో నిలవడం దాదాపు కష్టమే. ఇప్పటికే గ్రూప్ - ఎ నుంచి జింబాబ్వే టాప్ - 1లో దూసుకుపోతుండగా విండీస్ మూడో స్థానంలో ఉంది. ఇక సూపర్ సిక్సెస్ లో  మూడు మ్యాచ్ లు గెలిచి ఇతర జట్ల ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకోవడం తప్ప విండీస్ కు మరో గత్యంతరం లేదు.  

PREV
click me!

Recommended Stories

IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు
Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !