అప్పుడది కష్టమనిపించింది, కానీ....: నవదీప్ సైనీ

By telugu teamFirst Published Jan 11, 2020, 1:19 PM IST
Highlights

తెల్ల బంతితో బౌలింగ్ చేయడం తనకు ఇంతకు ముందు కష్టమనిపించేదని, కానీ ఇప్పుడు సులువైందని టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ అన్నాడు. శ్రీలంకపై జరిగిన టీ20 మ్యాచుల్లో సత్తా చాటి అతను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు.

పూణే: తన బౌలింగులో వేగం అనేది సహజంగానే వచ్చిందని టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ అన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచులో అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచు అవార్డు అందుకున్నాడు. అదే విధంగా మూడోది, చివరిది అయిన టీ20లో కూడా తన బౌలింగులో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు.

శుక్రవారం జరిగిన మ్యాచులో సైనీ 145 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ శ్రీలంక బ్యాట్స్ మెన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా అందుకున్నాడు. ఈ అవార్డు అందుకునే సమయంలో అతను మాట్లాడాడు.

వైట్ బాల్ తో ఆడడానికి ముందు తాను రెడ్ బాల్ తో ఆడేవాడినని, రెడ్ బాల్ తో బౌలింగ్ చేయడం కష్టంగా ఉండేది కాదని, కానీ వైట్ బాల్ తో బౌలింగ్ చేయడానికి శ్రమించాల్సి వచ్చేదని సైనీ అన్నాడు. వైట్ బాల్ తో ఎక్కువ ప్రాక్టీస్ చేసినతర్వాత సులభంగానే అనిపిస్తోందని అన్నాడు. 

తన బౌలింగ్ ను మెరుగుపరుచుకున్న తర్వాత వైట్ బాల్ తో బౌలింగ్ చేయడం కష్టమనింపించడం లేదని చెప్పాడు. తన సీనియర్ల నుంచి తీసుకున్న సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయని చెప్పాడు. ఏయే పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో వారు తనకు చెబుతున్నారని అన్నాడు. 

తన జిమ్, తన డైట్ తర్వాత భారత్ కు క్రికెట్ ఆడడమే తన గోల్ అని చెప్పాడు. దాదాపు నాలుగైదేళ్ల నుంచి రెడ్ బాల్ తో ఆడుతున్నట్లు, అంతకు ముందు టెన్నిస్ బంతితో ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. 

click me!