కేఎల్ రాహుల్ ముప్పు: ధావన్ మీద వ్యాఖ్యలపై కోహ్లీ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Jan 11, 2020, 12:56 PM IST
Highlights

టీ20లో ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం శ్రీలంకపై కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ పోటీ పడి బ్యాట్ ఝళిపించారనే వ్యాఖ్యలను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖండించాడు. ఓపెనింగ్ లో మూడు ప్రత్యామ్నాయాలు ఉండడం మంచిదని అన్నాడు.

పూణే: శ్రీలంకతో జరిగిన చివరి టీ20 మ్యాచులో శిఖర్ ధావన్ పోటీ పరుగులు చేశాడని, తనకు కేఎల్ రాహుల్ నుంచి ప్రమాదం ఉండడం వల్లే అలా చేశాడని వ్యాఖ్యానిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ పోటీల్లో శిఖర్ ధావన్ ను పక్కన పెట్టి కేఎల్ రాహుల్ ను తీసుకుంటారనే ప్రచారం కూడా ఉంది. ప్రపంచ కప్ టీ20 జట్టుకు పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ జట్లను ప్రకటిస్తున్నారు. 

ఓపెనర్ గా శిఖర్ ధావన్ కన్నా కేఎల్ రాహుల్ ఉత్తమమని మాజీ క్రికెటర్లు వివీఎస్ లక్ష్మణ్, కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. దాంతో ప్రపంచ కప్ టీ20ల్లో స్థానం కోసం శ్రీలంకతో జరిగిన చివరి 2ట్వంటీలో రాహుల్, ధావన్ పోటీ పడి పరుగులు చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానిపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. 

కేఎల్ రాహుల్ నుంచి ముప్పు ఉండడం వల్లే ధావన్ పరుగులు చేయడంలో దూకుడు ప్రదర్శించాడనే మాటను కోహ్లీ ఖండించాడు. ముగ్గురు ఓపెనర్లు సత్తా కలిగినవారైతే ప్రత్యామ్నాయాలకు మంచి అవకాశం ఉంటుందని ఆయన అన్నాడు. ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారనే మాటను తాను విశ్వసించబోనని అన్నాడు. ఆ వ్యాఖ్యల్లో వాస్తవం లేదని అన్నాడు. జట్టుగా ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నాడు. 

ఈ ఏడాది ఆరంభం సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంపై కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. కొత్త ఏడాదిలో శుభారంభం లభించిందని, సరైన దిశలో అడుగులు వేశామని ఆయన అన్నాడు. రెండు మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన పట్ల తాను ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు. 

పరుగులు 200లు దాటితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మిడిలార్డర్ విఫలమైనా పాండే, శార్దూల్ ఆదుకున్నారని, సీనియర్ ఆటగాళ్లు విఫలమైతే ఎవరు బాధ్యత తీసుకోగలరో చూడాలని, ఇలాంటి సందర్భాలు మరిన్ని రావాలని ఆయన అన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు సాధించాలని, ఈ రోజు మ్యాచులో 180 పరుగులు చేయగలమనుకుంటే అంతకన్నా ఎక్కువ చేశామని చెప్పాడు.

click me!