Kavitha’s arrest - KTR : ప్రస్తుతం రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ సర్కారుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Kalvakuntla Taraka Rama Rao: దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం, రాజకీయ కక్షసాధింపు కోసం సంస్థాగత దుర్వినియోగం సర్వసాధారణమైందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. "అధికార దుర్వినియోగం, రాజకీయ స్కోర్లను పరిష్కరించడానికి సంస్థాగత దుర్వినియోగం గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వంలో సర్వసాధారణంగా మారింది. ఈ కేసు కోర్టు విచారణలో ఉన్నప్పుడు, మార్చి 19న రెండు రోజుల్లో సమీక్షకు రానున్న సమయంలో అరెస్టు చేసే విపరీతమైన హడావుడిపై సుప్రీంకోర్టుకు ఈడీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ నీరుగార్చింది" అని పేర్కొన్నారు. అలాగే, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని చెప్పిన కేటీఆర్.. ఈ విషయంలో న్యాయపరంగా పోరాడుతూనే ఉంటామన్నారు.
ఢిల్లీ ఈడీ ఆఫీసులో కవిత.. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
కాగా, శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంట్లోనే ఆమె పిల్లలు, కుటుంబ సభ్యులతో కేటీఆర్ ఉన్నారు. ఆయన శనివారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. కవిత కుటుంబాన్ని చూసుకుంటూనే హైదరాబాద్ నుంచి పనులను పర్యవేక్షించి సమన్వయం చేస్తున్నారు. కవితను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి సాయంత్రం 5:20 గంటలకు కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసినట్లు అరెస్ట్ మెమోలో పేర్కొన్నారు. అరెస్టు గురించి ఆమె భర్త డాక్టర్ అనిల్ కుమార్‌కు సమాచారం అందించారు.