Ranji Trophy Final: ముంబై రంజీ ట్రోఫీని రికార్డు స్థాయిలో 42వ సారి గెలుచుకుంది. రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో విదర్భను ఓడించింది. 8 ఏళ్ల తర్వాత ముంబై ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
Ranji Trophy Final: 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ముంబై రంజీ ట్రోఫీని గెలుచుకుంది. రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై 169 పరుగుల భారీ తేడాతో విదర్భను ఓడించింది. దీంతో రంజీ ట్రోఫీ చరిత్రలో 42వ సారి ముంబై జట్టు టైటిల్ ను గెలుచుకుంది. 538 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు ఐదో, చివరి రోజైన గురువారం 134.3 ఓవర్లలో 368 పరుగులకు కుప్పకూలింది. విదర్భ తరఫున కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ 102 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు కానీ, జట్టుకు విజయాన్నిఅందించలేకపోయాడు. అతడితో పాటు హర్ష్ దూబే కూడా 65 పరుగులు చేశాడు. ముంబై తరఫున తనుష్ కొటియన్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు.
గురువారం మ్యాచ్ ప్రారంభం కాగానే విదర్భ విజయానికి మరో 298 పరుగులు చేయాల్సి ఉండగా ఐదు వికెట్లు మిగిలి ఉన్నాయి. విదర్భ జట్టు తొందరగానే ఔట్ అవుతుందనిపించింది. కానీ, కెప్టెన్ అక్షయ్ వాడ్కర్, హర్ష్ దూబే బాధ్యతగా ఆడారు. మొదటి సెషన్‌లో ముంబై బౌలర్లు వికెట్ల కోసం ప్రయత్నించారు. అయితే, ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ 93 పరుగులు జోడించడంతో లంచ్ సమయానికి విదర్భ గెలుపునకు 205 పరుగులు కావాలి.
లంచ్ తర్వాత వాడ్కర్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు కూడా అద్భుతాలు చేయగలదని అనిపించిన తరుణంలో వాడ్కర్‌ను ఔట్ చేసి విదర్భకు తనుష్ కోటియన్ గట్టి షాక్ ఇచ్చాడు. అక్షయ్ వాడ్కర్ 199 బంతుల్లో 102 పరుగులు చేశాడు. 353 పరుగుల వద్ద విదర్భకు అక్షయ్ రూపంలో ఆరో దెబ్బ తగిలింది. దీని తర్వాత, విదర్భ ఇన్నింగ్స్ తడబడింది. 15 పరుగుల వ్యవధిలో మరో 4 వికెట్లు పడిపోయాయి. ధావల్ కులకర్ణి తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతూ ఉమేష్ యాదవ్‌ను అవుట్ చేయడం ద్వారా ముంబైని 42వ సారి ఛాంపియన్‌గా మార్చాడు.
👏 The winning moment! 42nd Ranji Trophy win for Mumbai.
🫡 What a way to finish your domestic career! - An Indian domestic cricket legend. pic.twitter.com/6x8G2UQJTX
ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. అదే సమయంలో, రంజీ ట్రోఫీ ఈ సీజన్‌లో 502 పరుగులు చేసి 29 వికెట్లు తీసిన తనుష్ కొటియన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేసింది. విదర్భ జట్టు 105 పరుగులకే ఆలౌటైంది. అదే సమయంలో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 418 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 119 పరుగుల ఆధిక్యంతో ముంబై విదర్భకు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనిని ఛేదించిన విదర్భ జట్టు కేవలం 368 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Team India: సెనా దేశాల్లో అత్యధికంగా 5 వికెట్లు సాధించిన భారత బౌలర్లు