రాజస్ధాన్ రాయల్స్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, చాహల్ దెబ్బకు ముంబై ఇండియన్స్ బ్యాట్ మెన్స్ విలవిల్లాడిపోయారు. దీంతో రాయల్స్ జట్టు ముందు అతి తక్కువ టార్గెట్ వుంది.
ముంబై : ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ టీం తీరు మారడంలేదు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ముంబై బ్యాటింగ్ లైనప్ తో ఓ ఆటాడుకుంది. ముఖ్యంగా ట్రెంట్ బౌల్ట్ ఆదిలోని ముంబై టాపార్డర్ నడ్డివిరిస్తే యజువేందర్ చాహల్ దాన్ని కొనసాగించారు. దీంతో పడుతూ లేస్తూ బ్యాటింగ్ సాగించిన ముంబై నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 125 పరుగులు మాత్రమే చేసింది.
ముంబైలోని వాంఖడే వేదికన జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ కు దిగింది. ఇలా క్రీజులోకి వచ్చారో లేరో అలా వెనక్కిపంపుతూ ముంబై టాపార్డర్ ను కోలుకోలేని దెబ్బతీసాడు రాయల్స్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్. మొదట డెంజరస్ బ్యాట్ మెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసిన బౌల్ట్ అదే ఊపులో నమన్ ధీర్ ను కూడా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాతి ఓవర్లో బ్రేవిస్ ను కూడా ఔట్ చేసాడు. అయితే కేవలం ఒక్క బంతి తేడాతో బౌల్ట్ హ్యాట్రిక్ మిస్సయ్యింది.
ఇషాన్ కిషన్ కూడా బర్గర్ బౌలింగ్ లో ఔటవడంతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో బ్యాటర్ తిలక్ వర్మతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా, 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వర్మ ఔటయ్యారు. దీంతో ఇక ముంబై వికెట్ల పతనం ఆగలేదు.
పీయూష్ చావ్లా ను ఆవేష్ ఖాన్, టిమ్ డేవిడ్ ను నంద్రే బర్గర్, కోయిట్జీని చాహల్ పెవిలియన్ కు పంపారు. చివర్లో జస్ప్రీత్ బుమ్రా 8 పరుగులు, ఆకాష్ మద్వాల్ 4 పరుగులు వికెట్లను కాపాడుకోవడంతో ముంబైకి ఆలౌట్ ప్రమాదం తప్పింది. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ముందు 126 పరుగుల లక్ష్యం వుంది.
రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ నాలుగు ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే యజువేందర్ చాహల్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 11 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసాడు. ఇక నంద్రే బర్గర్ 2, ఆవేష్ ఖాన్ 1 వికెట్ తీసి ముంబై ఆటకట్టించారు.