హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి విజయంకోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ కుప్పకూలిపోతోంది.
ముంబై : ఈ ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తడబాటు కొనసాగుతోంది. ఈ సీజన్ లో ముంబైకి ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా లేదు. తాజాగా సొంత మైదానం వాంఖడేలోనూ అదే చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల దాటికి హోమ్ టీమ్ విలవిల్లాడిపోతోంది.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ టీం. దీంతో బ్యాంటింగ్ కు దిగిన ముంబైని రాయల్స్ బౌలర్ కోలుకోలేని దెబ్బ తీసారు. మొదటి ఓవర్ లోనే ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేసాడు ట్రెంట్ బౌల్ట్. ఆ తర్వాత చివరి బంతికే నమన్ ధీర్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో మరో ఓవర్లో హ్యాట్రిక్ అవకాశాన్ని కొద్దిలో మిస్సయ్యాడు బౌల్ట్.
బౌల్ట్ రెండో ఓవర్లో మొదటి బంతిని ఇషాన్ కిషన్ ఎదుర్కొన్నాడు. అయితే హ్యాట్రిక్ మిస్సయిన బౌల్ట్ రెండో ఓవర్ రెండో బంతికే మరో వికెట్ పడగొట్టాడు. బ్రెవీస్ వికెట్ పడగొట్టి ముంబై టాప్ ఆర్డర్ నడ్డివిరిచాడు బౌల్ట్.
ఇషాన్ కిషన్ ను బర్గర్, హార్దిక్ పాండ్యాను చాహల్ పెవిలియన్ కు పంపారు. తిలక్ వర్మతో కలిసి కొద్దిసేపు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసాడు హార్దిక్. కేప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొడుతూ కేవలం 21 బంతుల్లోనే 34 పరుగులు చేసాడు పాండ్యా. కానీ అతడిని చాహల్ ఔట్ చేసాడు. ఆ వెంటనే పీయూష్ చాహల్ కూడా అవేష్ ఖాన్ బౌలింగ్ లో ఓటయ్యాడు. దీంతో కేవలం 86 పరుగుల వద్దే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ముంబై టీమ్.
తాజా డకౌట్ తో రోహిత్ ఖాతాలో చెత్తరికార్డు చేరింది. ఐపిఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. తాజా ఔట్ తో కలిపి ఏకంగా 17సార్లు 0 పరుగులకే ఔటయ్యాడు రోహిత్. రోహిత్ తో సమానంగా 17 డకౌట్లతో దినేష్ కార్తిక్ నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ ఆటగాడు మాక్స్ వెల్ 15, పియూష్ చావ్ల 15, మన్దీప్ సింగ్ 15, సునీల్ నరైన్ 15 సార్లు డకౌట్ అయ్యారు.