
ముంబయి ఇండియన్స్ (mumbai indians) బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న బుమ్రా ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడు. ఈ సీజన్ లో MI తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బుమ్రా.. ఒక మ్యాచ్ లో రాణించకపోయినా తర్వాతి గేమ్ లో తిరిగి పుంజుకుంటాడు. పడ్డ ప్రతిసారి కెరటంలా లేచే బుమ్రా దినసరి చర్య ఎలా ఉంటుంది..? అని తెలుసుకోవాలనుందా..? అయితే అతడి భార్య సంజనా గణేషన్ ఆ విషయాలను బయటపెట్టింది. యూఏఈలో అతడితోనే ఉంటున్న ఈ స్టార్ యాంకర్ instagram వేదికగా ఈ విషయాలను బహిర్గతం చేసింది.
‘మ్యాచ్ కు ముందు బుమ్రా ప్రత్యేకంగా ఎలాంటి సెంటిమెంట్లూ, సంప్రదాయాలు ఫాలో కాడు. రిలాక్స్డ్ గా ఉంటాడు. ఆ రోజు చేయాల్సిన పనులన్నింటిపై అతడికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. గ్రౌండ్ కు వెళ్లే ముందు బస్ ఎక్కే టైమ్ కే బుమ్రా ఉదయం లేవడం, వ్యాయామాలు, ధ్యానం వంటి అన్ని పనులను పూర్తి చేసుకుంటాడు. కానీ మిగతా రోజుల్లో మాత్రం లంచ్ చేసే సమయం (మధ్యాహ్నం 2 గంటలకు) కు బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు ’ అని తెలిపింది.
ఇక ఏదైనా మ్యాచ్ లో చెత్త ప్రదర్శన తర్వాత బుమ్రా ఎలా కోలుకుంటాడనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘అలా జరిగిన రోజు అందుకు గల కారణాలను విశ్లేషించుకుంటాడు. తిరిగి పుంజుకోవడానికి సన్నద్దమవుతాడు. అందుకోసం ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుంటాడు. పడిన ప్రతిసారి అంతే స్పీడుగా రికవరీ కావడం బుమ్రాలో ఉన్న ప్రత్యేకత’ అని చెప్పింది. అంతేగాక ముంబయి ఇండియన్స్ జట్టు హోటల్ రూమ్ లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, క్రికెటర్ల భార్యలందరూ గేమ్స్ ఆడుతూ, కబుర్లు చెప్పుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చింది.