
వయసు ఒక అంకె మాత్రమే అని నిరూపించడంలో ధోనిది ప్రత్యేక శైలి. తన వయసున్న క్రికెటర్లు ఇప్పటికే ఎప్పుడో రిటైర్ అయిపోయి సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రశాంతంగా గడుపుతుంటే ధోని మాత్రం ఇంకా గ్రౌండ్ లో చురుకుగా కదులుతున్నాడు. వయసు మీద పడుతున్నా అతడిలో నాయకుడు మాత్రం నిత్య యవ్వనంగా బుర్రకు పదును పెడుతూనే ఉన్నాడు.
టీమ్ ను ముందుండి నడిపించడంలో ధోని ఆరితేరినవాడు. ఈ విషయంలో సందేహమే అక్కర్లేదు. ఇదే విషయమై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, సీఎస్కే తరఫున ఆడి రిటైర్ అయిన మాథ్యూ హెడెన్ ధోనిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని వయసు మాత్రమే పెరుగుతుందని.. జట్టును ముందుండి నడిపించడంలో మాత్రం ధోని ఎప్పటికీ నెంబర్ వనే అని అంటున్నాడు.
హెడెన్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాడు ధోనినే. వయసు ప్రభావంతో అతడి నుంచి మునపటి మెరుపులు మనం చూడకపోయినా సారథిగా మాత్రం అద్భుతమైన ఫలితాలు రాబడుతున్నాడు. ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో ధోనికి బాగా తెలుసు. డూప్లెసిస్, బ్రావో ల ప్రదర్శనే దీనికి నిదర్శనం’ అని ఈ వెటరన్ బ్యాట్స్మెన్ అన్నాడు.
ఐపీఎల్ లో చెన్నై తరఫున ధోనితో కలిసి పనిచేస్తున్న హెడెన్.. జట్టు ఎంపికలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. ధోని, హెడెన్, ఫ్లెమింగ్ వంటి దిగ్గజాలతో సీఎస్కే జట్టు ఈ సీజన్ కప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. గత ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ కు కూడా క్వాలిఫై కాకపోవడంతో నిరాశలోకి వెళ్లిన జట్టును తిరిగి నిలబెట్టాలని ధోని పట్టుదలతో ఉన్నాడు. కాగా, తదుపరి మ్యాచ్ లో సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ (sun risers Hyderabad) తో పోటీ పడనుంది.